ELEPHANTS: ఆంధ్రప్రదేశ్‌కు కుంకీ ఏనుగులు

ELEPHANTS: ఆంధ్రప్రదేశ్‌కు కుంకీ ఏనుగులు
X
ఆరు కుంకీ ఏనుగులను అప్పగించిన కర్ణాటక ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్‌కు ఆరు కుంకీ ఏనుగులను కర్ణాటక ప్రభుత్వం అప్పగించింది. బెంగళూరులోని విధానసౌధలో జరిగిన కార్యక్రమంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ పాల్గొన్న సభలో... ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ సమక్షంలో కుంకీ ఏనుగులను అప్పగించారు. కుంకీ ఏనుగుల అప్పగింత, వాటి సంరక్షణకు సంబంధించిన డాక్యుమెంట్లను పవన్‌కు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అందజేశారు. **శాస్త్రోక్తంగా గజ పూజ నిర్వహించిన అనంతరం జెండా ఊపుతూ కర్ణాటక ప్రభుత్వాధినేతలు కుంకీలను సాగనంపగా, పూల వర్షం కురిపిస్తూ పవన్ కళ్యణ్ ఆహ్వానం పలికారు. నాలుగు ఏనుగులను కర్ణాటక అటవీశాఖ అధికారుల నుంచి ఆంధ్రప్రదేశ్ అటవీ అధికారులు అధికారికంగా స్వీకరించారు. దేవా, కృష్ణ, అభిమన్యు, మహేంద్ర అనే పేర్లు కలిగిన కుంకీ ఏనుగులు ఆంధ్రప్రదేశ్‌కి అప్పగించారు.

పవన్ కృతజ్ఞతలు

కుంకీ ఏనుగులు ఇచ్చిన కర్ణాటక ప్రభుత్వానికి, సీఎం సిద్ధరామయ్యకు పవన్ కల్యాణ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎలాంటి సాయం అడిగినా కర్ణాటక ప్రభుత్వం ముందుకొస్తోందని అన్నారు. ఏపీ, కర్ణాటక మధ్య సహకారం ఇలాగే కొనసాగాలని పవన్‌ ఆకాంక్షించారు. కుంకీ ఏనుగుల సంరక్షణకు ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేశామని తెలిపారు. ఏపీ, కర్ణాటక మధ్య 9 ఒప్పందాలు కుదుర్చుకున్నామన్నారు. పంటపొలాల్ని నాశనం చేస్తున్న అడవి ఏనుగులను నియంత్రించేందుకు కుంకీ ఏనుగులను రంగంలోకి దించుతారు. పత్రాల అప్పగింతతో ఏపీ ప్రజలు అనేక సంవత్సరాలుగా ఎదురుచూస్తోన్న కుంకీ ఏనుగులు ఎట్టకేలకు రాష్ట్రానికి చేరనున్నాయి.

ఏజెన్సీ ప్రాంతాల్లో మోహరింపు

ఏజెన్సీ ప్రాంతాల్లో ఏనుగులు గ్రామాలు, పంట పొలాల్లోకి దూసుకువచ్చి పంటలను నాశనం చేయడం, అడ్డువచ్చిన వారిపై దాడి చేసి వారిని చంపటం సర్వసాధాణమైపోయింది. ఈ విషయమై ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాగానే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ విషయమై స్పందించారు. ఏనుగులను నిరోధించాలంటే కుంకీ ఎనుగులను ఏజేన్సీ ప్రాంతాల్లో మొహరించాలని నిర్ణయించారు. దీనికోసం గతేడాది కర్ణాటకలో పర్యటించిన ఆయన ఆరు కుంకీ ఏనుగులు ఏపీ ప్రభుత్వానికి అప్పగించాలని ఓ ఒప్పందం కుదుర్చుకున్నారు.

కుంకీ ఏనుగులు ఏం చేస్తాయ్‌?

కుంకీలు పూర్తి స్థాయిలో శిక్షణ పొందిన ఏనుగులు. ఎక్కడైనా ఏనుగుల గుంపు దాడికి దిగినప్పుడు కుంకీలను రంగంలోకి దింపుతారు. ఏనుగులను తరిమికొట్టడంలో ఇవి కీలక భూమిక పోషిస్తాయి. కొన్నిసార్లు గాయపడిన లేదా చిక్కుకున్న అడవి ఏనుగును రక్షించడానికీ వీటిని ఉపయోగిస్తారు. సాధారణంగా కుంకీ ఏనుగులుగా మగవాటినే ఎంపిక చేసుకుంటారు. ఎందుకంటే ఇవి మాత్రమే ఒంటరిగా సంచరిస్తుంటాయి. వీటిని బంధించి కొన్ని నెలల పాటు శిక్షణ ఇస్తారు. తర్వాత ఆపరేషన్ల కోసం వాడుతుంటారు. ఏనుగుల గుంపును అడవిలోకి తిరిగి పంపించేంత వరకు ఇవి విశ్రమించవు. కొన్నిసార్లు పంట పొలాలపైకి వచ్చిన ఏనుగులతో ఇవి తలపడాల్సి ఉంటుంది. అందుకే పోరాడడంలోనూ వీటికి ప్రత్యేక శిక్షణ ఇస్తారు.

భవిష్యత్తులో మరిన్ని కుంకీ ఏనుగులు

కర్ణాటకకు చెందిన మావటీలు రెండు నెలలపాటు కుంకీ ఏనుగులతో ఉండి ఆంధ్రప్రదేశ్ మావటీలకు వాటి సంరక్షణ తదితర అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. ఆంధ్రప్రదేశ్ అవసరాలకు అనుగుణంగా భవిష్యత్తులో మరిన్ని ఏనుగులు ఇవ్వడానికీ సిద్ధమని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. కర్ణాటక ఇచ్చిన కుంకీ ఏనుగుల ఆరోగ్య సంరక్షణ బాధ్యతను ఎప్పటికప్పుడు స్వయంగా పర్యవేక్షిస్తానని పవన్ హామీ ఇచ్చారు. కుంకీ అంటే పరిపూర్ణంగా శిక్షణ పొందిన అని అర్థం వస్తుంది. కుంకీ ఏనుగులు అంటే పరిపూర్ణంగా శిక్షణ ప ందిన ఏనుగు అని అర్థంలో వాడతారు. కుంకీ ఏనుగులను వన్యమృగాల నియంత్రణ కోసం ఉపయోగిస్తారు. **కుంకీ ఏనుగుల రాకతో పంట పొలాలకు రక్షణ కలుగుతుందని రైతులు భావిస్తున్నారు.

Tags

Next Story