AP: ఏలేరు కాలువకు గండి

AP: ఏలేరు కాలువకు గండి
10 అడుగుల మేర తెగిపోయిన కట్ట... పూడ్చివేత చర్యలు చేపట్టిన అధికారులు

కాకినాడ జిల్లాకు ఇప్పుడు మరో టెన్షన్ పట్టుకుంది. ఎగువ నుంచి వస్తున్న వరదతో ఏలేరు కాలువ ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద దాటికి మాకవరం మండలం రాచపల్లి వద్ద గండి పడింది. 10 అడుగుల మేర గట్టు తెగిపోయింది. దీంతో అండర్ టన్నెల్ నుంచి వరద నీరు స్థానిక గెడ్డలోకి వెళ్తోంది. ఈ విషయం తెలుసుకున్న అధికారులు గండి పడిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. గండి పూడ్చివేతపై చర్యలు చేపట్టారు. పనులకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. గండి పడిన చోట ప్రొక్లెయిన్లతో ఇసుక, మెటల్ మూటలను వేస్తున్నారు. గండి పూడ్చివేత పనుల్లో వేగం పెంచారు. రెండు, మూడు గంటల్లో పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. అయితే ఏలేరు కాలువకు తరచూ గండ్లు పడుతున్నాయని, దాని వల్ల తాము చాలా ఇబ్బందులు పడుతున్నామని, ఒక్కోసారి పొలాలు నాశనం అవుతున్నాయని స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.

బుడమేరుపై వదంతులు

బుడమేరుకు మళ్లీ వరద అంటూ వచ్చిన వదంతులతో విజయవాడ వాసులు మరోసారి భయాందోళనలకు గురయ్యారు. బుడమేరు కట్ట మళ్లీ తెగిందని.. భారీగా వరద వస్తుందన్న పుకార్లు వచ్చాయి. ఈ వదంతులపై స్పందించిన మంత్రి నారాయణ... ఈ పుకార్లు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని... విజయవాడ పూర్తి సురక్షితంగా ఉందన్నారు. బుడమేరుపై పుకార్లను వ్యాప్తి చేసేవారిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హెచ్చరించారు.


కలెక్టర్‌తో కలిసి మంత్రి పర్యటన

బుడమేరు కట్ట తెగిందంటూ ఆకతాయిల పుకార్లతో మంత్రి నారాయణ హుటాహుటీన రంగంలోకి దిగారు. కలెక్టర్ సృజనతో కలిసి కండ్రిక ఉడా కాలనీలో పరిస్థితిని సమీక్షించారు. కేవలం కొంతమంది ఆకతాయిల పుకార్లు సృష్టించారని మంత్రి నారాయణ, కలెక్టర్ సృజన్ నిర్ధారణకు వచ్చారు. ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని ప్రజలకు సూచించారు. బుడమేరు కట్ట తెగిందని వస్తున్న వదంతులు నమ్మవద్దని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన చెప్పారు. బుడమేరుకు ప్రస్తుతం ఏ ముప్పులేదని, ఉద్దేశపూర్వకంగా జరిగే ప్రచారాన్ని నమ్మి ఆందోళనకు గురికావొద్దని సూచించారు. ప్రజలను భయాందోళనకు గురిచేసే ఇలాంటి ఫేక్ న్యూస్ ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Tags

Next Story