Eluru : కాలువల్లో నీరున్నా....చేలకు చేరదు

Eluru : కాలువల్లో నీరున్నా....చేలకు చేరదు
ఏలూరు నీటిపారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యం

ప్రకృతి విపత్తు అయినా, అధికారుల అనాలోచిత నిర్ణయాలైనా.... చిట్టచివరకు రైతులే నట్టేటమునుగుతున్నారు. మిగ్‌జాం తుపాను దెబ్బకు... ఇప్పటికే రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో నీటిపారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యం రైతులను మరింత ఇబ్బందికి గురిచేస్తోంది. కాలువల్లో నీరున్నా....చేలకు అందడంలేదని ఏలూరు జిల్లా రైతులు మండిపడుతున్నారు.

డెల్టాలో రబీ వరిసాగు కీలక దశకు చేరుకుంది. కాలువలకు ఎగువనున్న ప్రాంతాల్లో మరో తడి నీరందితే తప్ప... పంట గట్టెక్కే పరిస్థితి కనిపించడంలేదు. మిగిలిన ప్రాంతాల్లో కనీసం రెండు మూడు వారాలు నీరందితే కానీ... రైతులు తేరుకునే పరిస్థితి లేదు. ఏలూరు జిల్లా దెందులూరు మండల పరిధిలోని వందలాది ఎకరాలు సాగునీరు అందక చివరి దశలో ఎండిపోతున్నాయి. కొవ్వలి ప్రాంతంలో సుమారు 450 ఎకరాల ఆయకట్టు నీళ్లు లేక బీటలు వారింది. గోదావరి కాలువకు చివరన ఉండే ఈ ఆయకట్టుకు కాలువలు, తూముల ద్వారా నీరు చేరుతుంది. ప్రస్తుతం గోదావరి కాలువలో పుష్కలంగా నీళ్లున్నా పొలాలకు మాత్రం నీరందడంలేదు.

రబీ సీజన్ ఆరంభంలో మందులు కొట్టేందుకు వీలు లేకుండా నీళ్లందించిన అధికారులు తర్వాత నీటి సరఫరాను తగ్గించారు. మూడు నెలల్లో ఎకరాకు కనీసం రెండు మూడు తడులూ ఇవ్వకపోవడంపై రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు. నీరివ్వలేమని ఆరంభంలోనే చెప్పి ఉంటే తమకు ఈ దుస్థితి వచ్చేది కాదంటున్నారు. చూసేందుకు ఆయకట్టంతా పచ్చగా ఉన్నా... ఓవైపు నుంచి ఎండిపోతూ వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే ఎకరాకు 40 వేల వరకు రైతులు పెట్టుబడులు పెట్టారు. మరో నాలుగైదు వేలు ఖర్చు చేస్తే పంట చేతికొస్తుందనుకున్న తరుణంలో నీరు లేక కళ్ల ముందే పంట ఎండిపోతుందని రైతులు లబోదిబోమంటున్నారు. వంతుల వారీగా అరకొర నీటిని విడుదల చేస్తున్నప్పటికీ అవి శివారు భూములకు అందడంలేదని చెబుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story