ఏలూరులో మాయదారి రోగం.. వైద్యం తీరుపై విపక్షాలు ఆందోళన

ఏలూరులో మాయదారి రోగం.. వైద్యం తీరుపై విపక్షాలు ఆందోళన

అంతా భయం భయం.. ఎప్పుడు ఏమవుతుందోనన్న భయం ఏలూరు ప్రజలను కుంగదీస్తోంది.. ఏలూరును ఇంతలా ఉక్కిరిబిక్కిరి చేస్తున్న మాయదారి రోగం ఎక్కడ్నుంచి పుట్టింది..? ఎలా వ్యాప్తి చెందుతోంది..? తాగే పదార్థాలలో సీసం కలవడం వల్లే ఇదంతా జరుగుతోందా..? ఏదీ తెలియదు.. శాంపిల్స్‌ సేకరించి పరీక్షలు జరుపుతున్నా మూలాలు మాత్రం బయటపడటం లేదు.. నిన్నటి వరకు అంతా నార్మల్‌ అని చెప్పగా.. తాజాగా నీళ్లు, పాలలో సీసం కలవడం వల్లే ఈ పరిస్థితి వచ్చినట్లుగా ప్రాథమిక నివేదికలో తేలినట్లుగా కొందరు చెబుతున్నారు.. అయితే, ఈ విషయంలోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు ఏలూరులో వేగంగా వ్యాప్తి చెందుతున్న వింత వ్యాధితో జనం ఉక్కిరిబిక్కిరి అవుతూనే ఉన్నారు.. ఎవరు, ఎప్పుడు, ఎలా స్పృహ తప్పి పడిపోతున్నారో అర్థంకాని పరిస్థితి. గంట గంటకూ కొత్త కేసులు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు.. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు వయసుతో సంబంధం లేకుండా రోగ లక్షణాలు కనిపిస్తున్నాయి. ఏలూరు జనరల్‌ ఆస్పత్రిలో పడకలు నిండిపోవడంతో బాధితులను సమీపంలోని ఆశ్రం వైద్యశాలకు తరలిస్తున్నారు.

అటు ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు వాస్తవాలకు పొంత కనిపించడం లేదు.. వ్యాధి లక్షణాలతో ఆస్పత్రికి వస్తున్న బాధితులకు తూతూ మంత్రంగా చికిత్స చేసి వైద్యులు చేతులు దులుపుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బెడ్లు లేవంటూ పేషెంట్లకు ట్యాబ్లెట్లు ఇచ్చి తిప్పి పంపేస్తున్నట్లుగా తెలుస్తోంది.. అటు ఆస్పత్రుల్లో బాధితులకు అందుతున్న వైద్యం తీరుపై విపక్షాలు ఆందోళన చెందుతున్నాయి.

ఇప్పటి వరకు మూర్ఛ లక్షణాలతో ఆస్పత్రికి వచ్చిన వారి సంఖ్య 500 దాటింది. చికిత్స అనంతరం కోలుకుని కొంతమంది ఇంటికి వెళ్తుండగా.. అదే సమయంలో కొత్త బాధితులు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు.. మరికొంతమందిని మెరుగైన చికిత్స కోసం విజయవాడ, గుంటూరు ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మొదట దక్షిణపు వీధిలో కేసులు బయటపడగా.. పడమర వీధి కొత్తపేట, వంగాయగూడెం, కొబ్బరితోట ప్రాంతాల్లోనూ పదుల సంఖ్యలో ప్రజలు ఆస్పత్రి పాలయ్యారు. దెందులూరు ఏరియాలోనూ పలువురు బాధితులు ఆస్పత్రుల్లో చేరగా.. వారందరికీ చికిత్స అందిస్తున్నారు.

మరోవైపు వ్యాధి ఎలా వ్యాప్తి చెందుతోందనే కారణాలపై కేంద్ర బృందం, WHO టీమ్‌, సైంటిస్ట్‌ల అధ్యయనం చేస్తున్నా.. ఇప్పటికీ ఇదీ స్పష్టమైన కారణం అని చెప్పలేకపోతున్నారు. నీళ్లు, పాలు శాంపిల్స్ కూడా టెస్టులకు పంపారు. తినే పదార్థాల్లో, తాగే నీటిలో కలిసిన రసాయనాల వల్లే ఈ ముప్పు వచ్చిందా, తాగునీటిలో భార లోహాలే వింత వ్యాధికి కారణమై ఉండొచ్చా.. అనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. రోగుల రక్త నమూనాల్లో సీసం, నికెల్ అవశేషాలు ఎందుకు కనిపించాయో కనిపెట్టే దిశగా పరీక్షలు చేస్తున్నారు వైద్యులు. పూర్తిస్థాయిలో నిర్ధారణకు రావాల్సి ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర సంస్థల నివేదిక వచ్చిన తర్వాతే పూర్తిస్థాయిలో వివరాలు వెల్లడిస్తామని అధికారులంటున్నారు.

ఏలూరులోని దక్షిణపు వీధిలో ఎన్‌ఐఎన్‌కు చెందిన తొమ్మిది మంది శాస్త్రవేత్తల బృందం క్షేత్రస్థాయిలో పర్యటిస్తోంది.. బాధితుల నుంచి 100 శాంపిల్స్‌ను సేకరించింది.. అస్వస్థతకు గురైన వారి ఇళ్లను సందర్శించింది.. వారు వినియోగించే పప్పులు, ఉప్పు, పాలు, నీరు, కూరగాయల శాంపిల్స్‌ సేకరించింది.. వాటిలో ఏవైనా వ్యాధి కారకాలు ఉన్నాయా అనే దానిపై అధ్యయనం చేస్తోంది. అలాగే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి నుంచి మరో 100 శాంపిల్స్‌ సేకరించింది.. దీనికి సంబంధించిన ఫలితాలు శుక్రవారం సాయంత్రానికి రానున్నట్లు తెలుస్తోంది.

ఏలూరులో వింత వ్యాధికి గురైన బాధితుల నుంచి ICMR ప్రతినిధులు శాంపిల్స్‌ సేకరించారు. దక్షిణపు వీధిలో స్థానికుల వద్దకు వెళ్లి వారి ఆరోగ్యం గురించి విచారణ చేయడంతోపాటు.. వారి నుంచి బ్లడ్‌ శాంపిల్స్‌ తీసుకున్నారు. వీటిని ల్యాబ్‌లో పరీక్షించడం ద్వారా వింత వ్యాధి గురించి మరింత సమాచారం తెలిసే అవకాశం ఉందన్నారు ICMR అధికారులు.

అటు అధికారులు భయం లేదని చెబుతున్నా, ప్రజల్లో మాత్రం ఆందోళన పెరిగిపోతూనే ఉంది.. ఈ అంతుచిక్కని వ్యాధి వైద్యులనూ వణికిస్తోంది. బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బంది సైతం ఇవే లక్షణాలతో ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది.. నిన్న రాత్రి ఓ నర్సు ఉన్నట్లుండి మూర్చపోయారు.. ఇవాళ మరో వైద్యుడు అస్వస్థతకు గురయ్యాడు. దీంతో వైద్యసిబ్బంది భయపడిపోతున్నారు. అయితే, వ్యాధి వ్యాప్తి వల్లే ఇలా జరుగుతోందా లేక, భయంతోనా అనేది అంతుబట్టకుండా ఉంది. వరుస ఘటనలపై అటు జనం.. ఇటు వైద్య సిబ్బందిలోనూ ఆందోళన వ్యక్తం అవుతోంది.

Tags

Next Story