AP Employees: సమ్మెకు సిద్దమవుతున్న ప్రభుత్వ ఉద్యోగులు

AP Employees: సమ్మెకు సిద్దమవుతున్న ప్రభుత్వ ఉద్యోగులు
ఈ నెల 27న చలో విజయవాడ ..

ప్రభుత్వం రెండేళ్లుగా బకాయిలు చెల్లించకుండా తాత్సారం చేస్తోందని ఆరోపిస్తూ ఉద్యోగ సంఘాల నేతలు మరోసారి రోడ్డెక్కారు. సరెండర్‌ లీవ్స్‌, డీఏ అరియర్స్‌, P.R.C. బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి జిల్లా కేంద్రాల వద్ద ఆందోళనలు చేపట్టారు. భారీ ర్యాలీలు చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం మొండి వైఖరి వీడకుంటేఈ నెల 27న చలో విజయవాడనిర్వహిస్తామని హెచ్చరించారు.

ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల డిమాండ్లు పరిష్కరించాలంటూ విజయవాడ ధర్నా చౌక్‌లో A.P.N.G.O పశ్చిమ కృష్ణా శాఖ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో 11 సార్లు చర్చలు జరిపినా...ఫలితం లేదని సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే శాంతియుతంగా నిరసనలు చేస్తున్నట్లు వివరించారు. వైకాపా పాలనలో ఉద్యోగులకు ఇచ్చిన ఒక్క హామీనీ నెరవేర్చలేదని గుంటూరులో ఏపీ జేఏసీ నేతలు ధ్వజమెత్తారు. ఉద్యమ శంఖారావం పేరిట నగరంలో ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం 21 వేల కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు.


కర్నూలులో జిల్లా పరిషత్ నుంచి కలెక్టరేట్ వరకు ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు ర్యాలీ నిర్వహించారు. C.P.S.ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయాలి ఉద్యోగ జేఏసీ నేత హృదయరాజు డిమాండ్‌ చేశారు. 12వ P.R.C ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కడపలో మహావీర్ కూడలి నుంచి ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు ర్యాలీగా కలెక్టరేట్ వద్దకు వచ్చారు. ఉద్యోగులు కలెక్టరేట్‌లోనికి వెళ్లకుండా ముళ్లకంచెతో పాటు...భారీగా పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినా....ఉద్యోగులకు ఎలాంటి ప్రయోజనం దక్కలేదని నేతలు విమర్శించారు. నెల్లూరులో ఉద్యోగ,ఉపాధ్యాయ, కార్మిక సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. పెండింగ్‌ బకాయిలు విడుదల చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం తదనుగుణంగా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో N.G.O కార్యాలయం ఎదుట ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఉద్యోగులకు బకాయిలు చెల్లించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని N.G.O నేత ఈశ్వరరావు ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే బకాయిలు చెల్లించాలని నినాదాలు చేశారు. శ్రీకాకుళంలో ఉద్యోగులు బైక్‌ ర్యాలీ నిర్వహించి జ్యోతిబా పూలే పార్క్‌ వద్ద నిరసన తెలిపారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకుంటే ఈ నెల 27న విజయవాడను దిగ్బంధిస్తామని హెచ్చరించారు.

Tags

Read MoreRead Less
Next Story