వైఎస్ వివేకా హత్యతో నాకు సంబంధం లేదు: ఎర్ర గంగిరెడ్డి

వైఎస్ వివేకానందరెడ్డి ఫైల్ ఫోటో
Ys Viveka Death Case: వైఎస్ వివేకా హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఎర్ర గంగిరెడ్డి అన్నారు. తాను చంపుతానని బెదిరించానంటూ వాచ్‌మెన్ రంగయ్య ఆరోపించిన నేపథ్యంలో.. దానిపై వివరణ ఇచ్చారు. వాచ్‌మెన్ రంగయ్యతో తనకు పరిచయమే లేదని అన్నారు. తాను ఎవరినీ బెదిరించలేదని స్పష్టం చేశారు. రంగయ్యను ఎప్పుడూ చూడలేదని, మాట్లాడలేదని చెప్పారు. రంగయ్య మద్యం మత్తులో మాట్లాడుతున్నాడని ఆరోపించారు. వివేకానందరెడ్డి తనకు దైవంతో సమానమని.. ఆయనకు అన్యాయం చేసే వ్యక్తిని కాదని అన్నారు. సీబీఐ వాళ్లు విచారణకు పిలిచిన ప్రతిసారీ వెళ్లానని వివరించారు.
వివేకా మరణవార్త ఆయన బావమరిది చెప్తే కానీ తనకు తెలియదని.. సంఘటనా స్థలంలో తమకంటే ముందే పోలీసులు ఉన్నారని చెప్పుకొచ్చారు. వివేకా హత్యతో సంబంధం లేదని.. ఆయనతో విభేదించే శక్తి తనకు లేదని వివరించారు. సీబీఐ విచారణ ఎటు సాగుతోందో అర్థం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
జమ్మలమడుగు మేజిస్ట్రేట్ ముందు రంగయ్య ఇచ్చినట్టు చెప్తున్న స్టేట్‌మెంట్‌లో సంచలన విషయాలు ఉన్నట్టు నిన్నంతా వార్తలు వచ్చాయి. రాత్రి సీబీఐ విచారణ తర్వాత తిరిగి పులివెందులకు వచ్చిన వాచ్‌మెన్ రంగయ్య కొన్ని సంచలన కామెంట్లు చేశారు. తనను ఎర్రగంగిరెడ్డి బెదిరించారని కూడా అన్నారు. వివేకాకు అత్యంత సన్నిహితుడైన ఎర్రగంగిరెడ్డి పేరు రంగయ్య నోటి నుంచి రావడంతో కలకలం రేగింది. దీంతో.. వివేకా హత్యతో తనకు సంబంధం లేదంటూ ఎర్రగంగిరెడ్డి చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com