మున్సిపల్ ఎలక్షన్ కౌంటింగ్‌కు సర్వం సిద్దం.. కౌంటింగ్ కేంద్రాల్లో గట్టి భద్రత

మున్సిపల్ ఎలక్షన్ కౌంటింగ్‌కు సర్వం సిద్దం.. కౌంటింగ్ కేంద్రాల్లో గట్టి భద్రత
అనంతపురం జిల్లాలో మున్సిపాలిటీ ఎలక్షన్స్‌ కౌంటింగ్‌కు అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లాలో 11 మున్సిపాలిటీలకు రేపు కౌంటింగ్ జరుగనుంది.

అనంతపురం జిల్లాలో మున్సిపాలిటీ ఎలక్షన్స్‌ కౌంటింగ్‌కు అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లాలో 11 మున్సిపాలిటీలకు రేపు కౌంటింగ్ జరుగనుంది. ఇందులో 8 మున్సిపాలిటీలు, రెండు నగర పంచాయతీలు కాగా.. ఒకటి కార్పొరేషన్ ఉంది. ఇందులో 337 వార్డు కౌన్సిలర్ల భవితవ్యం తేలనుంది. జిల్లాలో 66.79శాతం పోలింగ్ జరిగింది. అనంతపురం కార్పొరేషన్‌లో 50 డివిజన్లు ఉండగా.. 347 టేబుల్స్‌, 393 కౌంటింగ్ సూపర్వైజర్లు తోపాటు 11వందల మంది సిబ్బంది విధుల్లో పాల్గొననున్నారు. ప్రతి కౌంటింగ్ హాల్లో సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటుచేశారు.

అనంతపురం జిల్లాలోని హిందూపురం మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్ కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. 38 వార్డుల్లో జరిగిన ఎన్నికల ఫలితాలను ఎప్పటికప్పుడు వెల్లడించేందుకు కమిషనర్ వెంకటేశ్వర రావు ఏర్పాట్లను సిద్దం చేశారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా అధికారులు చర్యలు చేపట్టారు. 250 మంది కౌంటింగ్ సిబ్బం ది విధుల్లో పాల్గొననున్నారు.

ఎన్నికల ఓట్ల లెక్కిపునకు కడపజిల్లాలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. కడప నగరంలోని ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో బ్యాలెట్ బాక్సులను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌ను జిల్లా కలెక్టర్ పృధ్వీరాజ్ తనిఖీ చేశారు. అనంతరం అక్కడ జరుగుతున్న కౌంటింగ్ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఇందుకోసం కౌంటింగ్ హాల్లో 39 టేబుల్స్ ఏర్పాట్లుచేసినట్లు ఆయన పేర్కొన్నారు. 26 డివిజన్లకుగాను ఒకే ప్రాంగణంలో వేర్వేరు కౌంటింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

తూర్పుగోదావరిజిల్లా రాజమండ్రిలో రేపు జరుగబోయే కౌంటింగ్ కోసం సర్వం సిద్దంచేశారు. 7మున్సిపాలిటీలు, 3 నగరపంచాయతీల ఓట్ల లెక్కింపు జరుగనుంది. పెద్దాపురం మున్సిపాలిటీలోని 29 వార్డులకు ... 8 టేబుల్స్ మీద 4 రౌండ్లలో లెక్కింపు జరుగనుంది. ఇందుకోసం ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాట్లు చేశారు. సామర్ల కోట మున్సిపాలిటీలోని 31 వార్డులకు గాను రెండు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 29 వార్డుల ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

ఇక పశ్చిమ గోదావరిజిల్లా నరసాపురం మున్సిపాలిటీ ఎలక్షన్ కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లుచేసినట్లు సబ్ కలెక్టర్ విశ్వనాథన్ తెలిపారు. 28వార్డుల్లో ఓట్ల లెక్కింపు ఉదయం 8గంటలకు ప్రారంభం అవుతున్నట్లు ఆయన వెల్లడించారు. 28 టేబుల్స్ ఏర్పాటుచేసి... 84 మంది సూపర్ వైజర్లను నియమించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఒకవైపు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు, మరోవైపు కౌంటింగ్ కోసం ఏర్పాట్లు చేపట్టినట్లు వెల్లడించారు.

శ్రీకాకుళం జిల్లాలోని రెండు మున్సిపాలిటీలు, ఒక నగరపంచాయితీ ఎలక్షన్ కౌంటింగ్‌కు సర్వం సిద్దం చేసినట్లు అధికారులు వెల్లడించారు. కౌంటింగ్ సెంటర్ల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. పటిష్ట భద్రత మధ్య కౌంటింగ్ నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. కౌంటింగ్ సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లుచేసినట్లు పాలకొల్లు మున్సిపల్ కమిషనర్ రామారావు వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story