జమిలీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి : టీడీపీ అధినేత చంద్రబాబు

జమిలీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి : టీడీపీ అధినేత చంద్రబాబు
2022లో జమిలీ ఎన్నికలు వస్తే అందరూ సిద్ధంగా ఉండాలని నేతలు, కార్యకర్తలకు టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో సీఎం జగన్ పులివెందుల..

2022లో జమిలీ ఎన్నికలు వస్తే అందరూ సిద్ధంగా ఉండాలని నేతలు, కార్యకర్తలకు టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో సీఎం జగన్ పులివెందుల రాజ్యాంగం అమలు చేస్తున్నారని మండిపడ్డారు. కేసుల మాఫీ కోసం కేంద్రం కాళ్లు పట్టుకుంటున్నారని విమర్శించారు. జగన్‌ వర్గం కోర్టులపైనే ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తోందని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా గురించి కేంద్రాన్ని అడగకుండా రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. అమరావతిలో లక్ష కోట్ల రూపాయల సంపదను విధ్వంసం చేశారని మండిపడ్డారు. వ్యవసాయ మోటర్లకు మీటర్ల బిగింపు పేరుతో రైతుల మెడకు ఉరితాళ్లు బిగిస్తున్నారని మండిపడ్డారు.

జగన్‌ 17 నెలల పాలనలో రాష్ట్రంలో దోపిడీ రాజ్యానికి శ్రీకారం చుట్టారని చంద్రబాబు దుయ్యబట్టారు. బీసీలకు నష్టం లేకుండా కాపులకు రిజర్వేషన్ పెడితే..... జగన్ కుట్ర పూరితంగా బీసీల్లో చీలిక తెచ్చారని నిప్పులు చెరిగారు. కాపులకు రిజర్వేషన్ ఇవ్వబోమని జగన్‌ చెబుతున్నారని మండిపడ్డారు. అమలాపురం లోక్‌సభ నియోజకవర్గ నేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టిన వారికి భవిష్యత్‌లో గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. మరోవైపు... కరోనా నుంచి ప్రజల్ని కాపాడుకునేందుకు ప్రత్యేకంగా ఓ వెబ్ సైట్ ప్రారంభిస్తున్నట్టు చంద్రబాబు వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్‌లోని కుల రాజకీయాలను, ఎస్సీల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరముందని చంద్రబాబు అన్నారు. మహాత్మా గాంధీ చూపిన అహింసాయుత మార్గంలోనే సమస్యల్ని ఎదిరిద్దామని పార్టీ శ్రేణులు, ప్రజలకు పిలుపునిచ్చారు. ఎస్సీలపై జరుగుతున్న దాడుల్లో దేశంలోనే ఏపీ ముందుండటం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో సమానత్వాన్ని సాధించడమే గాంధీజీకి అందించే అసలైన నివాళి అని అన్నారు. మానవాళి చరిత్రలో గాంధీ మహాత్ముడు ఓ సమున్నత శిఖరం అని కొనియాడారు. సమసమాజం గురించి గాంధీజీ తపించారన్న చంద్రబాబు ... గాంధీ జయంతి సందర్భంగా ఆ మహాత్ముని దివ్య చరిత్రను స్మరించుకోవాలని ట్వీట్‌ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story