Narayana : మాజీ మంత్రి నారాయణకు బెయిల్

Narayana : మాజీ మంత్రి నారాయణ బెయిల్‌పై విడుదల అయ్యారు. వ్యక్తిగత పూచీకత్తుతో మేజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు. ఏపీలో టెన్త్ పేపర్ లీక్ కేసులో చిత్తూరు జిల్లా పోలీసులు నారాయణను హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి సరాసరి చిత్తూరు తీసుకెళ్లి, ప్రభుత్వాసుపత్రిలో వైద్యపరీక్షలు చేయించి, నారాయణను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. అయితే, టెన్త్ పేపర్ లీకేజీ కేసులో పోలీసుల అభియోగాన్ని న్యాయమూర్తి తోసిపుచ్చారు. 2014లోనే నారాయణ విద్యాసంస్థల ఛైర్మన్ పదవికి నారాయణ రాజీనామా చేసినప్పుడు.. ఇక ఆ కేసుతో నారాయణకు ఎలా సంబంధం ఉంటుందని మేజిస్ట్రేట్ ప్రశ్నించారు. నారాయణ తరపు న్యాయవాదులు సైతం దీనికి తగ్గ ఆధారాలు చూపించారు. దీంతో ఇద్దరు వ్యక్తుల నుంచి లక్ష రూపాయల చొప్పున జామీను తీసుకుని బెయిల్ ఇచ్చారు న్యాయమూర్తి.
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం నెల్లేపల్లిలోని జడ్పీ హైస్కూల్‌లో ఏప్రిల్ 27న టెన్త్ తెలుగు పేపర్ వాట్సప్ ద్వారా బయటకు వచ్చింది. ఈ కేసులో నారాయణ పాత్ర ఉందంటూ పోలీసులు తెలిపారు. హైదరాబాద్ నుంచి తరలించేటప్పుడు తెలంగాణ పోలీసులకు ఇదే కారణం చెప్పి నారాయణ తీసుకెళ్లారు. పేపర్ లీక్ వెనక మాజీ మంత్రి నారాయణ ఉన్నట్టు నారాయణ ఎస్వీ బ్రాంచ్ వైఎస్ ప్రిన్సిపల్ గిరిధర్‌రెడ్డి అంగీకరించారని పోలీసులు చెబుతున్నారు. ఆ వాంగ్మూలం ఆధారంగానే నారాయణను అరెస్టు చేసినట్లు ప్రకటించారు. అయితే, పోలీసులు మోపిన అభియోగాలు సరిగ్గా లేవంటూ మేజిస్ట్రేట్ బెయిల్ ఇచ్చారు.
నారాయణ అరెస్ట్‌పై రాత్రంతా న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు చంద్రబాబు. బెయిల్ వచ్చే వరకు కేసుపై పార్టీ నాయకులు, న్యాయవాదులతో మాట్లాడారు. మరోవైపు, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మార్పుల కేసులో నారాయణను మళ్లీ అరెస్ట్ చేసే అవకాశం ఉండడంతో.. ఈ విషయంపైనా న్యాయ నిపుణులతో సంప్రదింపులు చేశారు చంద్రబాబు. బాదుడే బాదుడు కార్యక్రమం కోసం ఇవాళ కుప్పం వెళ్లనున్నారు చంద్రబాబు.
బెంగళూరుకు విమానంలో వెళ్లి అక్కడి నుంచి కుప్పం చేరుకుంటారు. అయితే, ఈ లోపే చంద్రబాబును అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. ఏపీ సీఐడీ అధికారులు ఇప్పటికే హైదరాబాద్‌లో మకాం వేసినట్టు చెబుతున్నారు. అయితే, చంద్రబాబును అరెస్ట్ చేయడానికంటే ముందు నోటీసు ఇవ్వాల్సి ఉంటుందని, అది ఉదయం 9 గంటలలోపే ఇవ్వాలని న్యాయనిపుణులు చెబుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com