విశాఖ కార్పొరేషన్ పీఠంపై ఉత్కంఠ.. !

సాగర తీరంలో కౌంటింగ్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. విశాఖలో కార్పొరేషన్ పీఠంపై ఉత్కంఠ నెలకొంది. ఎవరు గెలుస్తారని ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రేపు ఉదయం 8 గంటల నుండి ఆంధ్రా యూనివర్సిటీలో పోలింగ్ కౌంటింగ్ ప్రారంభంకానుంది. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఎన్నికల అధికారులు.
ఆంధ్ర యూనివర్శిటీలోని నార్త్ క్యాంపస్‌లో 2, 3, 4, 6 జోన్ల పరిధిలోని వార్డుల ఓట్లను లెక్కిస్తారు. అలాగే సౌత్ క్యాంపస్‌లో 1, 5, 7, 8 జోన్ల పరిధిలోని వార్డుల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ప్రతి వార్డుకు ఒక హాలు కేటాయిస్తుండగా.. రిటర్నింగ్ అధికారి లేదా సహాయ రిటర్నింగ్ అధికారి పర్యవేక్షిస్తారు. ఒక్కొక్క ఆర్వోకు నాలుగు వార్డులు కేటాయించారు. ఒక వార్డులో సదరు ఆర్వో, మిగిలిన మూడు వార్డుల్లో సహాయ రిటర్నింగ్ అధికారుల సమక్షంలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
పోలైన ఓట్లను బట్టి సగటున ఏడు టేబుళ్ల వంతున 98 వార్డుల ఓట్ల లెక్కింపునకు 692 టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నారు. లెక్కింపునకు 3 వేల 40 మంది సిబ్బందిని నియమించారు. ప్రతి జోన్‌ను ఒక డిప్యూటీ కలెక్టర్ పర్యవేక్షిస్తారని, వారికి సహాయంగా నలుగురు తహసీల్దార్లు, ఎంపీడీవోలను నియమించామని ఆర్డీఓ కిషోర్ అన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరిగే సమయంలో యూనివర్శిటీ పరిసరాల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు.
ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమవుతుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రక్రియను చేపడతారు. పావుగంట వ్యవధిలో స్ట్రాంగ్ రూమ్ నుంచి బ్యాలెట్ బాక్సులు తెచ్చి ఏజెంట్ల సమక్షంలో లెక్కిస్తారు. పోలింగ్ ప్రక్రియ బ్యాలెట్ విధానంలో జరగడంతో ఏజెంట్ల నుంచి అభ్యంతరాలు లేకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. బ్యాలెట్ పత్రాలు కావడంతో మొత్తం లెక్కింపు పూర్తయ్యేసరికి అర్ధరాత్రి కావచ్చునని అధికారులు అంటున్నారు.
కౌంటింగ్ జరిగే ప్రతి హాలులో వీడియో కెమెరాలు, వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేశారు. ప్రతి రౌండ్ ముగిసిన వెంటనే ఫలితం వెల్లడించేందుకు ఏయూలో డిజిటల్ స్ర్కీన్లు ఏర్పాటు చేసారు. ప్రతి రౌండ్‌లో ఎక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థి వివరాలు, సమీప ప్రత్యర్థి కంటే ఆధిక్యం వెల్లడిస్తారు. అలాగే ఏయూ నార్త్ క్యాంపస్‌లో మీడియా పాయింట్ ఏర్పాటు చేసారు. కౌంటింగ్ రోజున నగరంలో మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. నగరంలోకి ప్రవేశించే వాహనాలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు ఉంటాయని కలెక్టర్ తెలిపారు.
అటు పార్టీ ఏజెంట్ల విషయంలోను కచ్చితంగా జాగ్రత్తలు పాటించేలా ఎన్నికల అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఓట్ల లెక్కింపులో అభ్యర్థి తరపున హాజరయ్యే ఏజెంట్లకు గుర్తింపు కార్డులు ఇస్తామని ఆర్డీఓ కిషోర్ అన్నారు. అభ్యర్థి తరపున ఏజెంట్ల వివరాలతో కూడిన ఫారం-15 సంబంధిత ఆర్వోకు వెంటనే అందజేయాలన్నారు.
ఫారం-15లో అభ్యర్థి, ఏజెంట్ల పేర్లు, వారి సంతకాలు ఉండాలన్నారు. పోలీసుల పరిశీలన అనంతరమే ఏజెంట్లకు గుర్తింపుకార్డు జారీ చేస్తారు అధికారులు. గుర్తింపు కార్డు, ఫారం-15 చూపితేనే కౌంటింగ్ హాలులోనికి అనుమతిస్తారు. ఇక కౌంటింగ్‌కి కౌంట్‌డౌన్ ప్రారంభం కావడంతో అన్ని పార్టీల అభ్యర్థులు, ఇండిపెండెంట్లు ఎవరికివారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com