ఏపీలో జీతాల కోసం ఉద్యోగులు, పెన్షనర్ల ఎదురుచూపులు

ఏపీలో జీతాల కోసం ఉద్యోగులు, పెన్షనర్ల ఎదురుచూపులు
ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల ఎదురుచూపులు తప్పడం లేదు. మార్చి నెల జీతాలు, పింఛన్లు శనివారం వస్తాయేమోనని లక్షల మంది ఎదురుచూశారు.

ఆంధ్రప్రదేశ్‌లో జీతాల కోసం ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల ఎదురుచూపులు తప్పడం లేదు. మార్చి నెల జీతాలు, పింఛన్లు శనివారం వస్తాయేమోనని లక్షల మంది ఎదురుచూశారు. ఇందుకు సంబంధించి ఎలాంటి సమాచారమూ లేదు. రాష్ట్రంలో 5 లక్షల మందికి పైగా ఉద్యోగులు, 3.60 లక్షల మంది ప్రభుత్వ పింఛనుదారులు ఉన్నారు. ఏప్రిల్‌ ఒకటిన ఆర్థిక సంవత్సరం మొదటిరోజు కావడంతో బ్యాంకులకు సెలవు. ఏప్రిల్‌ 2న గుడ్‌ ఫ్రైడే కావడంతో బ్యాంకులు పనిచేయలేదు. శనివారమే చెల్లింపులు జరుగుతాయని వీరంతా ఎదురుచూస్తూ ఉన్నారు. ఖజానాలో చాలినంత సొమ్ము అందుబాటులో లేకపోవడంతో శనివారం సాయంత్రం ఆర్థికశాఖ అధికారుల నుంచి సంబంధిత బిల్లులు రిజర్వ్‌ బ్యాంక్‌కు చేరలేదని తెలుస్తోంది.

ప్రభుత్వ ఉద్యోగుల జీతాల బిల్లుల్ని ప్రతి నెలా 25వ తేదీకల్లా డ్రాయింగ్‌ డిస్‌బర్సుమెంట్‌ అధికారులు ఖజానా కార్యాలయాలకు పంపుతారు. వారు అక్కడ కింది నుంచి పైస్థాయి వరకు వాటిని పరిశీలించి CFMSకు సమర్పిస్తారు. అక్కడ పరిశీలన తర్వాత ఆర్థికశాఖ అధికారులకు బిల్లులు చేరవేస్తారు. రాష్ట్రంలో నిధుల లభ్యతను బట్టి ఆర్థికశాఖ అధికారులు చెల్లింపుల ప్రక్రియ చేపడతారు. అదే పింఛన్ల విషయంలో CFMSలోనే బిల్లులు సిద్ధం చేసి ఖజానా కార్యాలయాలకు పంపితే అక్కడి అధికారులు పరిశీలించి తొలగించాల్సిన, జత చేయాల్సిన వాటిని పరిశీలించి, తిరిగి CFMSకు పంపుతారు.

ఇవి ఆర్థికశాఖ అధికారుల ద్వారా రిజర్వ్‌ బ్యాంక్‌కు చేరాల్సి ఉంటుంది. ఖాతాలో నిల్వల ఆధారంగా ఆర్థికశాఖ అధికారులు వీటిని రిజర్వ్‌ బ్యాంక్‌కు పంపుతారు. కొత్త ఆర్థిక సంవత్సరంలో జీతాలు, ఇతరత్రా చెల్లింపులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఉండేందుకు ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ రూపంలో ఆర్డినెన్సు జారీ చేశారు. ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ఆమోదం పొందినా జీతాలు, పింఛన్లకు సంబంధించి ఆయా హెడ్‌లలో ఎంట్రీలు పూర్తి చేయకపోవడం వల్ల జీతాల చెల్లింపునకు ఇబ్బంది ఏర్పడినట్లు తెలుస్తోంది. వరుసగా సెలవులు రావడంతో ఆయా ఖాతాల్లో ఎంట్రీలు నమోదు కాలేదని సమాచారం.

మార్చి 31 రాత్రి వరకు పాత బడ్జెట్‌ ప్రకారం బిల్లుల్ని నిధుల లభ్యత మేరకు చెల్లించారు. మార్చి 31 అర్ధరాత్రి ఏర్పడ్డ ఇబ్బందుల వల్ల వెయ్యి కోట్లకు పైగా మొత్తాలు వేరే విధానంలో చెల్లింపులకు ఏర్పాట్లు చేస్తున్నారు. జీతాలు, పింఛన్ల చెల్లింపులకు ఎంత లేదన్నా 5 వేల కోట్ల దాకా అవసరమవుతాయి. ఫిబ్రవరిలో చాలామంది ఉద్యోగులకు, పెన్షనర్లకు ఆదాయపు పన్ను కోత రూపంలో పెద్ద మొత్తాలు మినహాయించుకున్నారు. దీంతో ఆ నెల సర్దుబాటు చేసుకోవడం కష్టమైందని సామాన్య ఉద్యోగులు పేర్కొంటున్నారు.

జీతాల బిల్లుల చెల్లింపు ప్రక్రియ కోసం రిజర్వ్‌ బ్యాంక్‌కు సమర్పిస్తే ఆయా ఉప ఖజానా కార్యాలయాలకు యూనిక్‌ ట్రాన్సాక్షన్‌ సంఖ్య వస్తుంది. రాష్ట్రంలోని ఒక్క ఉప ఖజానా కార్యాలయానికీ శనివారం రాత్రి దాకా అలాంటి సమాచారమేమీ రాలేదు. ప్రస్తుతం మరో రెండు రోజులు వరుస సెలవులు ఉన్నాయి. మంగళవారమైనా జీతాలు వస్తాయా అనే చర్చ సాగుతోంది. ఈఎంఐల చెల్లింపు ఇతరత్రా అవసరాల కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు. పెన్షనర్లకు కిందటి నెలలో 20 నెలల బకాయిలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసినా అవీ దక్కలేదు. వాటికి తిరిగి బిల్లులు సమర్పించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే.. ఈ నెల 8వ తేదీకి గాని అందరికీ వేతనాలు అందే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story