AP: ఏపీలో దొంగ ఓట్ల కలకలం

ఏపీలో ఓటరు జాబితా అంశం సంచలనం సృష్టిస్తోంది. పెద్ద ఎత్తున ఓట్లు తీసేయడం….. కొత్త ఓట్లు చేర్చడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బాపట్ల జిల్లా రేపల్లె లో 19, 20 వార్డులలో 41వ బూత్‌లో ఒకే ఇంటి నంబరుపై 148 ఓట్లు, మరో ఇంటి నంబరులో 99 దొంగ ఓట్ల బయటపడ్డాయి. రెండు వార్డులలో స్థానికంగా అడ్రస్‌లేని విద్యార్థుల పేరిట 113 దొంగ ఓట్లను గుర్తించారు. మొత్తం 360 ఓట్లు దొంగ ఓట్లుగా బట్టబయలయ్యాయి. 18 ఏళ్లు నిండిన ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపు ప్రక్రియ చేపట్టిన క్షేత్రస్థాయి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. స్థానికంగా ఎలాంటి గుర్తింపు పత్రాలు లేకపోయినా .. దొంగ ఓట్లు ఉన్నట్లు గుర్తించారు. వీరంతా 18 నుంచి 20 సంవత్సరాలలోపు వారే. రేపల్లెలోని ఓ కాలేజీలో చదువుకునేందుకు వచ్చిన వందలాది మంది విద్యార్థులను స్థానిక ధ్రువీకరణ పత్రాలూ లేకుండా ఓటర్లుగా చేర్పించారు. ఇక నిజాంపట్నం వందలాది కుటుంబాల వారు వివిధ కారణాల వల్ల రేపల్లెలో నివాసం ఉంటున్నారు. వీరిలో వందలాదిమందికి రెండు చోట్ల ఓట్లు ఉన్నాయి. టీడీపీ తనిఖీలో ఈ తతంగమంతా బయటపడింది.
విజయవాడలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఒకే డోర్ నంబరుతో ప్రతి బూత్‌లోనూ వందల సంఖ్యలో ఓట్లు చేర్చారు. వాటిలో ఎక్కువ శాతం ఓటర్లు ఎవరో స్థానికులకే తెలియని పరిస్థితి. ఓటర్ కార్డుకు ఆధార్‌కు అనుసంధానం చేయకపోవడంతో..... అనేక చోట్ల దొంగ ఓట్లు సృష్టిస్తున్నారు. విజయవాడ పాయకాపురం సుందరయ్యనగర్‌లోని ఒకే డోర్ నెంబర్‌పై 47 ఓట్లు ఉన్నట్టు నున్న పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు టీడీపీ నేతలు. ఇక 63వ డివిజన్ రాజీవ్‌నగర్‌కు చెందిన 976 మంది ఓట్లను 61వ డివిజన్, పాయకాపురంలోని బూత్‌లో చేర్చారు. 59వ డివిజన్ లెనిన్ సెంటరులో 432 ఓట్లను 62వ డివిజన్‌లోని రాధానగర్ ప్రాంతం బూత్ జాబితాలో చూపారు. స్థానికంగా పోలింగ్ బూత్‌లున్నా వీరి ఓట్లను దూరంగా ఉన్న బూత్‌ల్లో ఎందుకు చేర్చారని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి...రాష్ట్రవ్యాప్తంగా దొంగ ఓట్లను చేర్పించి.. టీడీపీ అనుకూల ఓటర్లను తొలగించేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపిస్తున్నారు టీడీపీ నేతలు. దొంగ ఓట్లను చేర్చి అక్రమంగా గెలిచేందుకు వైసీపీ పన్నాగం పన్నిందంటూ మండిపడుతున్నారు టీడీపీ నేతలు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com