Fake Votes: ఆంధ్ర ప్రదేశ్‌లో దొంగ ఓట్ల దడ

ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ఏపీలో ఇబ్బడిముబ్బడిగా దొంగ ఓట్లు చేర్చుతున్నారు. పల్లెలు మొదలు ప్రధాన నగరాల వరకు ప్రతీచోటా కుప్పలు తెప్పలుగా బోగస్ ఓట్లు బయటపడుతున్నా యి. టీడీపీ కీలక నేతలు ఉన్న నియోజకవర్గాల్లో ఒకే ఇంటి నెంబర్ పేరుతో వందలకొద్దీ ఓట్లు ఉండటం చర్చనీయాంశంగా మారింది. వైసీపీ సానుభూతిపరులు, వాలంటీర్ల పేరిట రెండు, మూడేసి ఓట్లు ఉంటుండగా.. అదే సమయంలో విపక్షాలకు చెందిన సానుభూతిపరుల ఓట్లు గల్లంతవ్వడం ఆందోళన కల్గిస్తోంది.
ప్రస్తుతం అనంతపురం జిల్లాలో దొంగ ఓట్లపై జోరుగా చర్చ జరుగుతోంది. ఏ బూత్‌లో చూసినా బోగస్ ఓట్లు బయటపడుతున్నాయి. వేలల్లో దొంగ ఓట్లున్నా అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉరవకొండ, రాప్తాడు, ధర్మవరంతోపాటు తాడిపత్రి నియోజకవర్గాల్లో చనిపోయిన, డబుల్ ఎంట్రీలు, శాశ్వత వలసలు, ఊరితో సంబంధం లేని ఓట్లు దర్శనమిస్తున్నాయి. ఈ ఓట్లపై ఫిర్యాదు చేసినా సంబంధిత అధికారులు తొలగించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
టీడీపీ నేతల ఫిర్యాదుతో విషయం తెలుసుకున్న సంబంధిత అధికారులు ఇప్పటికే ఉరవకొండకు చెందిన రిటర్నింగ్ అధికారులను సస్పెండ్ చేశారు. ఈ క్రమంలోనే ఒక ఆశ్రమంలోని 600 ఓట్లను తొలగించేందుకు సిద్ధమైన తహసీల్దార్‌పై ఓ ఎమ్మెల్యే ఆయన అనుచరులు దాడి చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఊరిలో.. ప్రొద్దుటూరుకు చెందిన ఆయన బంధువుల ఓట్లు గుర్తించారు టీడీపీ నేతలు.
ఇక కేవలం ధర్మవరం నియోజకవర్గంలోనే 13వేల బోగస్ ఓట్లు ఉన్నట్లు పుట్టపర్తి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు టీడీపీ నేత పరిటాల శ్రీరామ్. టీడీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారంటూ కంప్లైంట్ చేశారు. గత సర్పంచ్ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకున్న చాలామంది ఓట్లు ఇప్పుడు ఓటర్ జాబితాలో కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. దీంతో సంబంధిత అధికారులు ఇంటింటి సర్వే చేపట్టేందుకు నిర్ణయించుకోగా.. అవిఏమి పట్టించుకోవద్దంటూ స్థానిక నేతలు చెబుతున్నట్లు తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com