AP: ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుపై కొనసాగుతున్న సంబరాలు
జగన్ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తూ చంద్రబాబు సంతకం చేయడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. భూములకు రక్షణ లేకుండా పోతుందనే ఆందోళనకు చంద్రబాబు అడ్డుకట్టవేశారని రైతులు, న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని చంద్రబాబు రద్దు చేయడాన్ని గుంటూరు జిల్లా రైతులు స్వాగతించారు. వైకాపా ప్రభుత్వం అమలు చేయాలని భావించిన భూరక్ష చట్టంలో ప్రజల ఆస్తులకు ప్రమాదం కలిగించే అంశాలెన్నో ఉన్నాయన్నారు. ఇప్పుడు చట్టం రద్దుతో ఊపిరి పీల్చుకున్నామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టం అమలై ఉంటే ప్రజల ఆస్తులకు భద్రత లేకుండా పోయేదని గుంటూరు జిల్లా న్యాయవాదులు తెలిపారు.
చట్టంలోని ప్రమాదకర అంశాలను న్యాయవాదులుగా తాము ముందుగా గుర్తించి ఆందోళనలు నిర్వహించామన్నారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేస్తూ చంద్రబాబు సంతకం చేయడంపై గుంటూరు జిల్లా కోర్టు వద్ద సంబరాలు నిర్వహించారు. ప్రజల ఆస్తి హక్కులను ప్రశ్నార్థకంగా మార్చిన భూ హక్కు చట్టం రద్దును..అఖిల భారత న్యాయవాదుల సంఘం, గుంటూరు బార్ అసోసియేషన్ సభ్యులు స్వాగతించారు గన్నవరం నియోజకవర్గం రంగన్నగూడెం రైతులు ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దుపై సంబరాలు చేసుకున్నారు. పొలాల్లో వేసిన జగనన్న సర్వే రాళ్లను... రైతు నేత ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు నేతృత్వంలో రైతులు కూల్చివేశారు. చంద్రబాబు చిత్రపటానికి పామాయిల్ గింజలతో అభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు. రీసర్వే పాసు పుస్తకాల ప్రతులను చించి మంటల్లో వేసి తగలబెట్టారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తూ సీఎం చంద్రబాబు సంతకం చేయడంపై ..అవనిగడ్డ బార్ అసోసియేషన్ న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు పై ప్రకాశం జిల్లా ఒంగోలులో లాయర్లు హర్ష వ్యక్తం చేశారు. కేక్ కోసి పంచారు. కర్నూలు జిల్లా కోర్టు ఆవరణలో చంద్రబాబు ఫ్లెక్సీకి న్యాయవాదులు క్షీరాభిషేకం చేశార. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై సిక్కోలు న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ నాయకులు చంద్రబాబుకి ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. హిందూపురంలో న్యాయవాదులు, తెలుగుదేశం పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. చంద్రబాబునాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com