YS Vivekananda Reddy: వివేకా హత్య వెనుక కొందరు పెద్ద నాయకుల ప్రమేయం..

YS Vivekananda Reddy: వివేకా హత్య వెనుక కొందరు పెద్ద నాయకుల ప్రమేయం..
YS Vivekananda Reddy: వై.ఎస్‌.వివేకా హత్య కేసులో పలువురు సీబీఐకు ఇచ్చిన వాంగ్మూలాలు ఒక్కటొక్కటిగా వెలుగుచూస్తున్నాయి.

YS Vivekananda Reddy: మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్య కేసులో పలువురు సీబీఐకు ఇచ్చిన వాంగ్మూలాలు ఒక్కటొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. తాజాగా వివేకా బావమరిది, అల్లుడి అన్న నర్రెడ్డి శివప్రకాష్‌ రెడ్డి సీబీఐ వాంగ్మూలం బయటకు వచ్చింది. గతేడాది అగస్టు 28న సీబీఐకు ఇచ్చిన వాంగ్మూలంలో వివేకా హత్య వెనుక కొందరు పెద్ద నాయకుల ప్రమేయం ఉందన్నారు నర్రెడ్డి శివప్రకాష్‌ రెడ్డి.

ఘటనా స్థలంలోని ఆధారాల్ని ధ్వంసం చేయడానికే గుండెపోటు ప్రచారాన్ని తెరపైకి తెచ్చారని, ఆ ప్రచారం ప్రారంభించిన వ్యక్తులకే వివేకా హత్య కుట్రలో ప్రమేయం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. కడప ఎంపీ వై.ఎస్‌.అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డి, చిన్నాన్న మనోహర్‌రెడ్డి సమక్షంలోనే ఆధారాల ధ్వంసం జరిగిందని.. దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డిల ఆదేశాల మేరకు అక్కడున్న రక్తాన్ని పనిమనుషులు తుడిచారని సీబీఐ వాంగ్మూలంలో శివప్రకాష్‌ రెడ్డి వివరించారు.

అవినాష్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డిలకు స్నేహితుడైన ఉదయ్‌కుమార్‌రెడ్డి వివేకా మృతదేహానికి కట్లు కట్టడానికి కాటన్, బ్యాండేజీతో పాటు డాక్టర్లు, కాంపౌండర్లను ఏర్పాటు చేశారని తెలిపారు. 2019 మార్చి 15వ తేదీ వేకువజామున 4 గంటలకే వివేకా మృతి గురించి వారికి తెలుసన్నారు. వివేకా, జగన్‌ మధ్య విబేధాలకు కడప ఎంపీ టికెటే కారణమన్నారు శివప్రకాష్‌ రెడ్డి. 2004 ఎన్నికల్లో కడప ఎంపీ టికెట్‌ కావాలని జగన్‌ పట్టుబట్టినా, ఆ టికెట్‌ వివేకానందరెడ్డికి లభించడం.. వైఎస్‌ఆర్‌ మరణం తర్వాత కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో వివేకా చేరడం జగన్‌కు ఇష్టం లేదని తెలిపారు.

అప్పటినుంచే వారిద్దరి మధ్య విభేదాలు ఉండేవని చెప్పారు. వైఎస్‌ వివేకా చనిపోయారని 2019 మార్చి 15వ తేదీ ఉదయం 6 గంటల18 నిమిషాలకు ఆయన పీఏ ఎంవీ కృష్ణారెడ్డి తనకు ఫోన్‌ చేశారని నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డి తెలిపారు. కడప ఎంపీ అవినాష్‌రెడ్డికి, వివేకా సోదరుడు రవీంద్రనాథ్‌రెడ్డికి ఉదయం 6 గంటల 26నిమిషాలకు ఫోన్‌ చేసి ఈ విషయం చెప్పానన్నారు. టైపిస్టు ఇనయతుల్లాకు ఫోన్‌ చేసి వివేకా ఇంటికి వెళ్లి చూసి ఏం జరిగిందో చెప్పాలని సూచించానన్నారు.

తర్వాత తమ కుటుంబమంతా రెండు వాహనాల్లో హైదరాబాద్‌ నుంచి పులివెందులకు బయల్దేరామని, అవినాష్ రెడ్డి ఘటనా స్థలానికి వెళ్లిన తర్వాత కూడా తమకు సమాచారం ఇవ్వలేదని తెలిపారు. ఆయనకు ఫోన్‌ చేస్తే తీయకపోవడంతో, ఎర్ర గంగిరెడ్డికి ఫోన్‌ చేసి వివేకా మరణం గురించి చెప్పానని.. అతను మాత్రం చాలా తేలిగ్గా.. అట్లానా అనడంతో ఆశ్చర్యం కలిగిందన్నారు. వివేకా హత్యకు గురైన రోజు రాత్రి ఎర్ర గంగిరెడ్డి పులివెందుల్లోనే ఉన్నారని సీబీఐకి నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డి స్టేట్ మెంట్ ఇచ్చారు

Tags

Read MoreRead Less
Next Story