AP Panchayat Elections 2021: రేపు ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు!

AP Panchayat Elections 2021 : రేపు ఏపీ వ్యాప్తంగా తొలిదశ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా విజయనగరం మినహా మిగిలిన 12 జిల్లాల పరిధిలో తొలి విడతలో 2వేల 723 గ్రామ పంచాయతీల్లో పోలింగ్ జరగనుంది. ఉదయం 6.30 గంటలకే పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మినహా మిగిలిన చోట్ల మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం 1.30 గంటల వరకే పోలింగ్ నిర్వహిస్తారు.
తొలి విడతలో మొత్తం 3వేల 249 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు రిటర్నింగ్ అధికారులు నోటిఫికేషన్ జారీ చేయగా 525 గ్రామాల్లో సర్పంచి ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిశాయి. దీంతో 2వేల 723 గ్రామాల్లో సర్పంచి పదవికి పోలింగ్ జరగనుంది. మొత్తం 32వేల 502 వార్డు సభ్యుల పదవులు ఉండగా 12వేల 185 ఏకగ్రీవమయ్యాయి. మరో 157 వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదు. మిగిలిన 20వేల 160 వార్డు సభ్యుల పదవులకు రేపు పోలింగ్ నిర్వహిస్తారు.
తొలివిడత పంచాయతీ ఎన్నికలు జరిగే గ్రామాల్లో ఓట్ల లెక్కింపు కూడా రేపే చేపట్టనున్నారు. పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే సాయంత్రం నాలుగు గంటల తర్వాత ఎక్కడికక్కడే ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మొదట.. వార్డు సభ్యుల ఓట్ల లెక్కింపును చేపడతారు. గ్రామంలో ఒకటో వార్డు నుంచి చివరి వార్డు వరకు లెక్కింపు పూర్తయిన తర్వాత.. సర్పంచి ఓట్ల లెక్కింపును చేపడతారు.
ఇక వెబ్‌కాస్టింగ్‌తో అన్ని పోలింగ్ కేంద్రాలపై నిఘా పెట్టారు అధికారులు. కంట్రోల్‌రూం నుంచి వెబ్‌కాస్టింగ్‌ను పర్యవేక్షించనున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు రికార్డు చేసిన డేటాను వినియోగించుకునేందుకు వీలుగా నిక్షిప్తం చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద బారికేడ్లతో కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని.. ఓట్ల లెక్కింపు రాత్రి వరకు కొనసాగితే సరిపడా లైట్లు ఏర్పాటుచేయాలని ఎన్నికల అధికారులు ఆదేశించారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా మాస్కులు, శానిటైజర్లు అందుబాటులో ఉంచనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com