జలమయ్య కష్టం చెదలపాలు.. కూడబెట్టిన రూ.5 లక్షలూ..

పైసా పైసా కూడబెట్టి పది లక్షలు చేద్దామనుకున్నాడు. పెట్టెలో పెడితే అవే వుంటాయిలే అనుకున్నాడు. సోమవారం సొమ్ము అవసరమై పెట్టె తెరిచి చూస్తే ఏముంది నోట్ల కాయితాలన్నీ చెదలు పట్టి ఉన్నాయి. వాటిని చూసి భోరున విలపించాడు. కష్టమంతా చెదల పాలైందని లబోదిబోమంటున్నాడు.
వివరాల్లోకి వెళితే కృష్ణా జిల్లా మైలవరం గ్రామానికి చెందిన జమలయ్యది నిరుపేద కుటుంబం. స్థానికంగా విజయవాడ రోడ్డులోని వాటర్ ట్యాంక్ వద్ద మాంసం దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. రేకుల షెడ్డులో ఉంటున్న జమలయ్య పక్కా ఇల్లు కట్టుకుందామని ఆశపడ్డాడు. అందుకోసం తాను రోజువారీ సంపాదించే దాంట్లో నుంచి రోజుకి కొంత మొత్తాన్ని ట్రంకు పెట్టెలో భద్రపరుస్తూ వస్తున్నాడు.
గత రెండేళ్ల నుంచి డబ్బు పెట్టెలో జమ చేస్తున్నాడు. ఇప్పటి వరకు దాదాపు రూ.5 లక్షలు కూడబెట్టాడు. సోమవారం లక్షరూపాయల సొమ్ము అవసరమైంది. దాచి వుంచిన సొమ్ములో నుంచి తీద్దామని భావించాడు. అటక మీద ఉంచిన పెట్టెను కిందకు దించాడు.
మూత తెరవగా నోట్లన్నీ చెదలు పట్టి ఉన్నాయి. వాటిని ఇరుగు పొరుగు వారికి చూపించగా చెలామణికి పనికిరావన్నారు. ఈ విషయం పోలీసుల వరకు వెళ్లగా జమలయ్య ఇంటికి వెళ్లి ఆరా తీశారు. సారూ.. ఇదంతా నా కష్టార్జితం.. ఎందుకూ పనికిరాకుండా పోయిందని పోలీసుల ఎదుట బాధితుడు కన్నీరుమున్నీరయ్యాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com