Flood Affected Areas : ముంపు ప్రాంతాల్లో బురద కష్టాలు.. మాటల్లో వర్ణించలేం

Flood Affected Areas : ముంపు ప్రాంతాల్లో బురద కష్టాలు.. మాటల్లో వర్ణించలేం

కృష్ణానదీతీరంలో వరద తగ్గుముఖం పట్టింది. ముంపు ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. పునరావాస కేంద్రాలు, బంధువుల నివాసాల్లో తలదాచుకున్న వారంతా మంగళవారం వేకువ జామునే తమ తమ ఇళ్లకు చేరుకున్నారు. ఇళ్లలో చేరిన వరదనీటిని తోడేశారు. మేటవేసిన బురదను తొలగించి నివాసాలను శుభ్రం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. బట్టలు, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ నీటిలో మునిగి బురదమయమయ్యాయి. విద్యుత్ సరఫరా లేక, నీటి వనరులకు ఇబ్బందులు పడాల్సి వచ్చింది.

కనీసం మొబైల్ ఫోన్లకు చార్జింగ్ కూడా లేకుండా అయింది. విజయవాడ సమీపంలోని రామలింగేశ్వర నగర్, శివ పార్వతీ నగర్, యనమలకుదురు, పెదపులిపాక, చోడ వరం, ఉప్పులూరు నదీ తీర ప్రాంతాల్లో, విజయవాడ - అవనిగడ్డ కరకట్ట దిగువన దాదాపు 15 వేలకు పైగా కుటుంబాలు ముంపునకు గురయ్యాయి. ఇక్కడి అపార్టుమెంట్లు మొదటి ఫ్లోర్ వరకు మునిగాయి. మంగళవారం నాటికి వరద ఉధృతి తగ్గడంతో గ్రౌండ్ ఫ్లోర్ వరకు నీటిమట్టం తగ్గింది. సాయంత్రానికి ముంపు నుంచి తేరుకున్నాయి.

కొన్ని ప్రాంతాల్లో రహదా రులపై ఇంకా వరద నీరు నిలిచివుంది. పెదపులిపాక సమీపంలోని గణపతినగర్, శ్రీనగర్, ఎన్టీఆర్ కాలనీ, ఏఎన్ఆర్ కాలనీలలోని తీరానికి సమీపంలో ఉన్న నివాసాలు ఇంకా వరద ముంపులోనే ఉన్నాయి. ప్రకాశం బ్యారేజి నుంచి రామలింగేశ్వర నగర్ శివారు వరకు రిటైనింగ్ వాల్ నిర్మించినప్పటికీ ప్రాంతవాసులకు ప్రయోజనం లేకపోయింది. వరద ఉదృతిని అంచనా వేయడంలో స్థానిక అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. బాధితులు కూడా గతంలో వచ్చిన వరదలు లాగానే భావించి అలసత్వంగా ఉండిపోయారు. ఇళ్లలోని ఫర్నిచర్ నీటిలో నాని, పాడైపోవడంతో లబోదిబోమంటున్నారు.

Tags

Next Story