AP: ఇంకా ముంపులోనే లంక గ్రామాలు
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలు ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయి. చుట్టూ నీరు చేరడంతో లంకలు ఇంకా జల దిగ్బంధం నుంచి బయటపడలేదు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీకి ఎగువన వరద తగ్గుముఖం పడుతున్నా లంక గ్రామాలు మాత్రం వరద ముప్పులోనే ఉన్నాయి. వరద ప్రవాహం అధికంగా ఉండటంతో గ్రామాలు మరింత విలవిల్లాడాయి. భద్రాచలం వద్ద 42.90 అడుగుల నీటిమట్టం... అదే సమయాల్లో కాటన్ బ్యారేజీ వద్ద 15.60, 14.60 అడుగుల నీటిమట్టాలు నమోదయ్యాయి. ఈ ఆనకట్ట వద్ద 15.79 లక్షల క్యూసెక్కులు, రాత్రి 14.19 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడిచిపెట్టారు. రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించే అవకాశం కనిపిస్తోంది. సాయంత్రానికి 11-12 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచిపెట్టొచ్చని భావిస్తున్నారు.
భారీ వర్షాలు, గోదావరి వరదలతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో వరి సాగు సుమారు 45 వేల ఎకరాలు, 15 వేల ఎకరాలకు అవసరమైన నారుమళ్లు ముంపులో ఉన్నాయి. 90 శాతం పంట దెబ్బతిన్నట్లేనని ప్రాథమిక అంచనా. రైతులకు మళ్లీ విత్తనాలు అందించేందుకు అధికారులు ప్రతిపాదనలు పంపించారు. అరటి, బొప్పాయి, పూలు, కూరగాయలు, తమలపాకు పంటలు పదివేల ఎకరాల్లో ముంపు బారినపడ్డాయి. వరదల ప్రభావం కోనసీమ జిల్లాలోని 50 గ్రామాల పరిధిలో 200 ఆవాసాలపై ఉంది. రోజువారీ వేటకు వెళ్లే మత్స్యకారులు, కూలి పనులపై ఆధారపడ్డవారు ఇళ్లకే పరిమితమయ్యారు. అత్యవసర పనులమీద బయటకు వెళ్లాల్సిన వారికి జిల్లావ్యాప్తంగా 75 పడవలు ఏర్పాటుచేశారు.
బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని సుమారు 40 లంక గ్రామాల్లో వేల ఇళ్ల చుట్టూ భారీగా నీళ్లు చేరాయి. ప్రజలు ఐదు రోజులుగా ముంపులోనే గడుపుతున్నారు. పి.గన్నవరం మండలం శివాయలంక, చినకందాలపాలెం, సఖినేటిపల్లి మండలంలోని అప్పనరామునిలంక, ఓఎన్జీసీ కాలనీ, కొత్తలంక, లాకుపేట, ముమ్మిడివరం మండలం గురజాపులంక, లంకా ఆఫ్ ఠాణేలంక, లంకా ఆఫ్ గేదెల్లంక, కూనలంక, రాజోలులోని నున్నవారిబాడవలో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. నిత్యావసర సరకులు, ఆహార పొట్లాలు అందించాలని బాధితులు కోరుతున్నారు.
కోనసీమ జిల్లాలో 3,388 ఎకరాల్లో వరి నారుమళ్లు మునిగిపోగా ఇందులో 762.95 ఎకరాల్లో పూర్తిగా దెబ్బతిన్నట్లు అంచనా వేశారు. అరటి 594.28 హెక్టార్లు, కూరగాయలు 945.80 హెక్టార్లలో దెబ్బతిన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో అరటి 460 హెక్టార్లలో, కూరగాయలు 348.65 హెక్టార్లలో దెబ్బతిన్నాయి. కాకినాడ జిల్లాలో 992 హెక్టార్లలో వరినాట్లు నీట మునిగాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com