గర్భిణికి శాపంగా మారిన వరదలు.. హాస్పిటల్‌కు వెళ్లే దారిలేక రోడ్డుపైనే ప్రసవం

ఒకవైపు వరదలు.. మరోవైపు గర్భిణి పురిటినొప్పులతో బాధపడుతోంది. హాస్పిటల్‌కు వెళ్లే దారిలేదు. అంబులెన్స్ రావాలంటే వరద ప్రవాహాన్ని దాటాలి. అది సాధ్యం కాలేదు. ఈలోపు గర్భిణి నత్తల భాగ్యలక్ష్మికి పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. అంబులెన్స్ వరకు చేరుకునే టైం కూడా లేదు. దీంతో ఏం చేయాలో ఆమె కుటుంబసభ్యులకు అర్థం కాలేదు. ఇంతలో అక్కడే ఉన్న గోపీ అనే వ్యక్తి తనకు తెలిసిన వైద్యంతో డెలివరీ చేశారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉండడంతో అంతా ఊరిపిపీల్చుకున్నారు.
గుంటూరు జిల్లా ఈపూర్ లంక గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వరద ఉధృతితో కొల్లూరు నుంచి లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అదే సమయంలో పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణి భాగ్యలక్ష్మిని ఆసుపత్రికి తీసుకెళ్లడం కుదరలేదు. అంబులెన్స్‌కు కాల్ చేస్తే అది అవతలి వైపు వరకు వచ్చింది. ఇక పరిస్థితిని వివరిస్తూ ఎస్సై ఉజ్వల్‌కు కుమార్‌కు సమాచారం ఇచ్చారు. ఆయన హుటాహుటిన చేరుకున్నారు. కానీ గర్భిణికి పురిటి నొప్పులు ఎక్కువ కావడం.. స్థానికులు అక్కడే డెలివరీ చేయడంతో ప్రమాదం తప్పింది.
ఆ తర్వాత అక్కడ చేపలు పట్టుకుంటున్న పల్లెకారుల సహాయంతో రోప్ పట్టుకుని బాలింతను మంచంపై వరద ప్రవాహాన్ని దాటించారు. అక్కడి నుంచి 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. బాలింతను, ఆమె బిడ్డను సురక్షితంగా వరద ప్రవాహాన్ని దాటించడానికి సాహసించిన స్థానికులను ఎస్సై ఉజ్వల్ కుమార్ అభినందించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com