Pawan Kalyan : సమాజంలో వైషమ్యాలు సృష్టించే శక్తులు పేట్రేగిపోతున్నాయి : పవన్ కల్యాణ్

సమాజంలో వైషమ్యాలు సృష్టించేలా, సామాజికవర్గాల మధ్య అంతరాలు పెంచేలా ఈ మధ్య కొన్ని శక్తులు పేట్రేగిపోతున్నాయని కలెక్టర్లు, ఎస్పీల సదస్సులో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. అలాంటి శక్తుల కదలికల పట్ల నిరంతరం నిఘా ఉంచాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు సమష్టిగా కష్టపడదామని పిలుపునిచ్చారు. సామాజిక వర్గాల మధ్య గొడవలుపెట్టేలా పెడుతున్న ఫ్లెక్సీలు, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు, సభలు సమావేశాలపై పోలీసులు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి... అలాంటి శక్తులను ముందస్తుగా గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. రాష్ట్రంలోకి పెట్టుబడులు రాకుండా, అభివృద్ధిని నిరోధించే విధంగా ప్రజల్లో వైషమ్యాలు సృష్టించేందుకు, రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు కొందరు చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని చెప్పారు. సీఎం శాంతిభద్రతల పరిరక్షణకు అధిక ప్రాధాన్యమిస్తున్నారన్నారు. శాంతిభద్రతల పరిరక్షణతోపాటు పలు అంశాలపై అధికారులకు దిశానిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ "మహిళల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యమివ్వాలి. వారి రక్షణ విషయంలో ఖచ్చితమైన లక్ష్యాలను నిర్ధేశించుకుని ముందుకు వెళ్లాలి. సుగాలి ప్రీతి కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకు తీసుకువెళ్లాలి. ఆ కుటుంబానికి త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలి. సాంఘిక సంక్షేమ హాస్టళ్ల వద్ద, ముఖ్యంగా బాలికల హాస్టళ్ల వద్ద సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయాలి. సంక్షేమ హాస్టళ్ల వద్ద జరుగుతున్న నేరాలు వెలుగులోకి రావడం లేదన్నారు పవన్.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com