AP News: అన్నదాతల పాలిట శాపంగా మారిన వైసీపీ పాలన

AP News:  అన్నదాతల పాలిట శాపంగా మారిన  వైసీపీ పాలన
ప్రభుత్వ నిర్లక్ష్యం కోలుకోలేని దెబ్బ

వైకాపా పాలన అన్నదాతల పాలిట శాపంగా మారింది. ఇప్పటికే ప్రకృతి విపత్తులతో కుదేలైన రైతులను ప్రభుత్వ నిర్లక్ష్యం కోలుకోలేని దెబ్బతీసింది. తమది రైతు ప్రభుత్వమనికర్షకులను చేయిపట్టుకుని నడిపిస్తున్నామని డప్పుకొడుతున్న పాలకులు... కనీసం వారి అవసరాలను తీర్చట్లేదు. పగటిపూట 9 గంటలు విద్యుత్ సరఫరా చేస్తామని అధికారంలోకి వచ్చిన జగన్.. మాట తప్పారు. ఫలితంగా నాణ్యమైన విద్యుత్ అందక పంటలు ఎండిపోతున్నాయి. చేసేదేమీ లేక పంటలను.. పశువులకు మేతగా వదిలేశారు.

నష్టపోయిన సాగుదారులను ప్రభుత్వం ఆదుకోకపోగా ఉన్న అవకాశాలకు గండికొడుతోంది. అన్నదాతలకు నాణ్యమైన విద్యుత్ సరఫరాలోనూ వైకాపా సర్కార్ విఫలమైంది. అనంతపురం జిల్లాకు గుండెకాయలాంటి H.L.C. కాలువ శిధిలమైనా ఈ ఐదేళ్లలో ఒక్కరూపాయి ఖర్చుపెట్టి మరమ్మతులు చేయలేదు. ఈ కాలువపై ఉన్న కనేకల్ చెరువు అత్యంత కీలకమైనది. చెరువు, ప్రధాన కాలువ కింద కనేకళ్, బొమ్మనహాళ్‌ మండలాల్లో సుమారు 30 వేల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. బోర్ల ఆధారంగా రెండో పంట కింద... 10వేల ఎకరాల్లో వరి పండిస్తున్నారు. తొలిపంటకే ప్రభుత్వం నీరివ్వకపోవటంతో దిగుబడి తగ్గి అన్నదాతలు నష్టపోయారు. తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా చేస్తామన్న ప్రభుత్వం... రైతులను నిలువునా ముంచేసింది. కనీసం ఏడు గంటల నిరంతర విద్యుత్ కూడా ఇవ్వలేకపోతుంది. నాణ్యత లేని విద్యుత్ సరఫరాతో బోరు మోటర్లు కాలిపోతున్నాయి. మరోవైపు పంటలకు నీరందంక వరి పంటలు ఎండిపోతున్నాయి.

ఈసారి తీవ్ర వర్షాభావ పరిస్థితులతో వరి నాట్లు వేసే సమయంలోనే రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు. చాలా మంది రైతులు వరికి తెగుళ్లు సోకి ఎండిపోవడంతో రెండు, మూడు సార్లు నాట్లు వేయాల్సి వచ్చింది. ఇప్పటికే రైతులు పూర్తిగా అప్పులపాలై నష్టపోయారు. దెబ్బమీదదెబ్బ పడినట్లుగా ప్రభుత్వ నిర్లక్ష్యం అన్నదాతలను మరింత కుంగదీస్తోంది. తొమ్మిది గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయక పంటలు పూర్తిగా ఎండిపోయాయి. నేకల్, బొమ్మనహాళ్ మండలాల్లో 5 వేల ఎకరాల్లో వరి పైరు ఎండిపోవడంతో జీవాలకు మేతగా వేస్తున్నారు.

పంటలు కళ్లెదుటే ఎండుపోతుంటే రైతులు కన్నీరు పెడుతున్నారు. కనీసం పెట్టుబడి కూడా రాదని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తొమ్మిది గంటల సరఫరా ఇవ్వాలని వేడుకుంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story