West Godavari: ఒకే స్కూల్‌లో ఒక్క నెలలో నలుగురు విద్యార్ధులు మృతి.. ఇంతకీ ఏం జరుగుతోంది అక్కడ..?

West Godavari: ఒకే స్కూల్‌లో ఒక్క నెలలో నలుగురు విద్యార్ధులు మృతి.. ఇంతకీ ఏం జరుగుతోంది అక్కడ..?
West Godavari: స్కూల్‌లో చేరితే చదువొస్తుందనుకున్నారు గాని, చావొస్తుందని ఊహించలేదు.

West Godavari: స్కూల్‌లో చేరితే చదువొస్తుందనుకున్నారు గాని, చావొస్తుందని ఊహించలేదు. అమ్మ ఒడి, నాడు-నేడు అని ఊదరగొట్టడం చూసి ప్రభుత్వ పాఠశాల అద్భుతం అనుకున్నారు. కాని, ఆ పాఠశాలే తమ పిల్లలను మృత్యుఒడికి చేరుస్తుందనుకోలేదు. ప్రమాదవశాత్తు జరిగితే ఆయుష్షు తీరిందనుకుంటాం. కాని, వరుసగా మరణమృదంగం వినిపిస్తోందంటే ఏంటర్థం.

ఒకరిద్దరు కాదు.. నెల రోజుల్లోనే ఆ స్కూల్‌లో నలుగురు పిల్లలు చనిపోయారు. మరికొందరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అసలు ఆ గ్రామంలో ఏం జరుగుతోంది? నెల రోజుల్లో నలుగురు విద్యార్థులు ఎందుకు చనిపోయారు? పదుల సంఖ్యలో విద్యార్థులు ఎందుకు ఆస్పత్రుల పాలవుతున్నారు? పశ్చిమ గోదావరి జిల్లా ఏజెన్సీలోని కొయ్యలగూడెం మండలం బోడిగూడెం గ్రామం.

ఇక్కడ ఉన్న జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలలో దాదాపు 320 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ గ్రామానికి చెందిన వారే కాకుండా చుట్టుపక్కల గ్రామాల విద్యార్థులు కూడా ఇక్కడికే వచ్చి చదువుకుంటారు. ఏం జరిగిందో తెలీదు గానీ గడిచిన నెల రోజుల్లో ఈ పాఠశాలలోని విద్యార్థులు ఒకరి తర్వాత ఒకరు చనిపోయారు.

ఇలా వరుసగా నలుగురు విద్యార్థులు కన్నుమూశారు. మరికొందరు మంచాన పడ్డారు. దీంతో గ్రామంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. చలాకీగా, ఆరోగ్యంగా ఉన్న పిల్లలు ఉన్నట్టుండి ఎందుకు చనిపోతున్నారు, ఎందుకు అనారోగ్యానికి గురవుతున్నారో తెలియడం లేదు. అయితే, చనిపోయిన పిల్లలంతా ఒకే స్కూల్‌ విద్యార్థులు కావడంతో ప్రభుత్వ పాఠశాలలోనే ఏదో జరిగిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ స్కూల్‌ను మూసి వేశారు.

తమ పిల్లల చావుకు పాఠశాలలో కలుషిత ఆహారమే కారణమంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బాధిత కుటుంబ సభ్యులు. బోడిగూడెం పాఠశాలలో ఏం జరిగిందో తెలుసుకునేందుకు కూడా ప్రభుత్వం ప్రయత్నమే చేయలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తామే పాఠశాల మూసివేయాలని పట్టుబట్టామని, విద్యార్థుల మరణానికి, మరికొందరి అనారోగ్యానికి ప్రభుత్వమే కారణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పరీక్షల కోసం ఇక్కడ ఆహారం, నీటి శాంపిల్స్‌ తీసుకెళ్లిన అధికారులు.. ఆ నివేదికను బయటపెట్టాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం సకాలంలో స్పందించకపోవడంపై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు గ్రామంలో జరుగుతున్న పరిస్థితిపై స్థానిక అధికారులు, వైద్య సిబ్బంది తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని నిలదీశారు.

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఇదే పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్నప్పటికీ కనీసం ఆ గ్రామానికి ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. విద్యార్థుల పాలిట మేనమామ అని చెప్పుకునే జగన్ మోహన్ రెడ్డి.. విద్యార్థుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నా ఎందుకు చోద్యం చూస్తున్నారని నిలదీశారు. నారా లోకేష్ ప్రభుత్వంపై నిప్పులు చెరగడంతో.. బోడిగూడెం విషాదం ఒక్కసారిగా స్టేట్ టాపిక్‌గా మారింది.

వెంటనే ఎమ్మెల్యే బాలరాజుతో పాటు జాయింట్ కలెక్టర్ హిమాన్షు శుక్లా, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, రెవెన్యూ, విద్యాశాఖ అధికారులు బోడిగూడెం వెళ్లి సుడిగాలి పర్యటన చేశారు. నామమాత్రంగా గ్రామంలో పర్యటించి, ఆ తరువాత కొయ్యలగూడెం వచ్చేసి అక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో స్థానిక అధికారులతో సమీక్ష నిర్వహించారని గ్రామస్తులు విమర్శిస్తున్నారు.

ఏ కారణంతో తమ పిల్లలు చనిపోయారో తెలియక తల్లిదండ్రులు ఆందోళన పడుతుంటే.. కనీసం వారి ఇళ్లకు వెళ్లి పరామర్శించకుండా, విద్యార్ధుల మరణానికి అనారోగ్యమే కారణమంటూ జాయింట్ కలెక్టర్ శుక్లా స్టేట్‌మెంట్ ఇచ్చారు. మృతి చెందిన వారు ఇతర అనారోగ్య సమస్యలతోనే చనిపోయారంటూ జేసీ శుక్లా తేల్చి చెబుతున్నారు.

ఎండ్ వాయిస్: ఒకే పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు చనిపోతూ, అనారోగ్యానికి గురవుతుంటే.. కారణం వారివారి అనారోగ్య పరిస్థితులేనంటూ ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తుండటంపై గ్రామస్తులు, ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. అసలు ఆహారం, నీళ్ల శాంపిల్స్‌ టెస్టులో ఏం తేలింది? రిపోర్ట్స్ ఏం చెబుతున్నాయనేది ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story