AP: ఏపీ రాజధానిపై మళ్లీ జగన్ కుట్రలు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అమరావతి అంశం మరోసారి వేడెక్కింది. గత కొన్ని రోజులుగా వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లోనే కాకుండా ప్రజల్లోనూ చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియలు ముందుకు సాగుతున్న వేళ, ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. ఒకప్పుడు స్వాగతించిన రాజధానిపై ఇప్పుడు ప్రశ్నలు లేవనెత్తడం ద్వారా జగన్ రాజకీయ వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వైఎస్ జగన్ అమరావతి రాజధానిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నదీగర్భ ప్రాంతంలో రాజధాని నిర్మాణం జరుగుతోందని ఆరోపించిన ఆయన, ఇలాంటి అంశాన్ని సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకోవాలన్నారు. రాజధాని అనే పదానికే స్పష్టత లేదని, సీఎం ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని అనే తన అభిప్రాయాన్ని మరోసారి పునరుద్ఘాటించారు. నదీ గర్భంలో భవన నిర్మాణాలకు అనుమతులు ఉండవని చెబుతూ, అలాంటప్పుడు రాజధాని నిర్మాణం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. రహదారులు, తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక వసతులు లేని ప్రాంతంలో రాజధాని అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తూ అమరావతిని ‘సో కాల్డ్ క్యాపిటల్’గా అభివర్ణించారు.
ఈ వ్యాఖ్యలు వెలువడిన వెంటనే రాజకీయ వర్గాల్లో తీవ్ర స్పందన వచ్చింది. ముఖ్యంగా గతంలో అమరావతిపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేసిన వైసీపీ నేతల మాటలకు ఇవి పూర్తి విరుద్ధంగా ఉండటంతో విమర్శలు మరింత పెరిగాయి. కొద్ది రోజుల క్రితమే వైఎస్ జగన్ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, అమరావతి రాజధానిగా ఉండడంపై తమకు అభ్యంతరం లేదని ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాంటి ప్రకటన తర్వాత జగన్ చేసిన వ్యాఖ్యలు పార్టీ వైఖరిలో స్పష్టతలేమిని చూపిస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అమరావతి రాజధాని ప్రయాణం వెనుక ఉన్న చరిత్రను పరిశీలిస్తే రాజకీయ మలుపులు స్పష్టంగా కనిపిస్తాయి. 2014లో ఆంధ్రప్రదేశ్ విభజనతో రాష్ట్రం రాజధాని లేకుండా మిగిలిపోయింది. అదే ఏడాది జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.
కొత్త రాజధాని కోసం రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పరిశీలనలు జరిపి, చివరకు గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలోని తూళ్లూరు మండలం పరిధిలోని 28 గ్రామాలను కలుపుకుని అమరావతిని రాజధానిగా ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో స్వాగతిస్తూ ప్రకటన చేయడం అప్పట్లో విశేషంగా చర్చకు వచ్చింది. రాజధాని నిర్మాణానికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. అమరావతిలో భవనాల నిర్మాణాలు, మౌలిక సదుపాయాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఈ దశలోనే మరోసారి అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. 2019 ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి స్పష్టమైన మెజారిటీ ఇచ్చారు. దాంతో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన వికేంద్రీకరణ అనే నినాదంతో జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు, పరిపాలన రాజధానిగా విశాఖపట్నం అనే ప్రకటన రాజకీయంగా పెద్ద చర్చకు దారి తీసింది. ఈ నిర్ణయం అమరావతికి భూములు ఇచ్చిన రైతుల్లో తీవ్ర ఆందోళనను రేపింది. తమ భవిష్యత్తు అనిశ్చితిలో పడిందంటూ వారు ఉద్యమ బాట పట్టారు.
రైతులు నాటి నుంచి ఆందోళనలు, నిరసనలు, దీక్షలు చేపట్టారు. న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు, అమరావతి నుంచి అరసవల్లి వరకు పాదయాత్రలకు ప్రయత్నించారు. మొదట్లో అనుమతులు నిరాకరించినా, చివరకు న్యాయస్థానాల జోక్యంతో అనుమతులు లభించాయి. అయినప్పటికీ అడుగడుగునా పోలీసు నిఘా, ఆంక్షలతో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు మూడు రాజధానులుగా ప్రకటించిన ప్రాంతాల్లో ఒక్క ఇటుక కూడా వేయలేదన్న విమర్శలు ప్రభుత్వం ఎదుర్కొంది. ఇదే సమయంలో ప్రతిపక్ష నేతలపై కేసులు, అరెస్టులు, జైలు పాలయ్యే పరిస్థితులు చోటుచేసుకోవడం ద్వారా జగన్ పాలనపై ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. ఈ నేపథ్యంతోనే 2024 ఎన్నికలు వచ్చాయి. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి కూటమిగా పోటీ చేశాయి. ఫలితాల్లో కూటమికి 164 సీట్లు దక్కగా, వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితమైంది. ప్రతిపక్ష హోదా కూడా దక్కని పరిస్థితి ఏర్పడింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

