AP: సవాళ్ల సమరంతో అట్టుడికిన అనపర్తి

AP: సవాళ్ల సమరంతో అట్టుడికిన అనపర్తి
తెలుగుదేశం నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అడ్డగింతతో ఉద్రిక్తత.... చర్చకు రావాలంటూ నల్లమిల్లి సవాల్‌

సవాళ్ల సమరంతో అనపర్తి నియోజకవర్గం అట్టుడికింది. వైసీపీ ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి దంపతుల అవినీతిపై చర్చకు సిద్ధమైన తెలుగుదేశం నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అడ్డగించారు. వారిని తీసుకుంటూ వెళ్లేందుకు ప్రయత్నించిన నల్లమిల్లి సహా తెలుగుదేశం కార్యకర్తలను బలవంతంగా ఆపేయడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తెలుగుదేశం నాయకులు, పోలీసుల మోహరింపులతో... తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరం హోరెత్తింది. వైసీపీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి దంపతులు 500 కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించిన తెలుగుదేశం నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి... బహిరంగ చర్చకు సవాల్‌ చేశారు. ఈమేరకు అనపర్తి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఆయనకు మద్దతుగా వందలాదిగా తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు రామవరానికి తరలివచ్చారు.


అప్పటికే రామవరంలో భారీగా మోహరించిన పోలీసులు తెలుగుదేశం నాయకులు అనపర్తి వెళ్లకుండా అడ్డుకున్నారు. నల్లమిల్లిని ముందస్తు అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. ఈ చర్యను తీవ్రంగా ప్రతిఘటించిన నల్లమిల్లి.... పార్టీ నాయకులు, కార్యకర్తల సహకారంతో పోలీసులను నెట్టుకుంటూ ఇంట్లో నుంచి బయటికి వచ్చారు. కారులోకి ఎక్కిన ఆయన... అనపర్తి వెళ్లేందుకు యత్నించారు. పోలీసులు ఆపడంతో కారులో నుంచి దిగి అక్కడే బైఠాయించారు. ఈ క్రమంలో రామవరంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అనపర్తి ఎమ్మెల్యేని స్వేచ్ఛగా వదిలేసిన పోలీసులు తమను అడ్డుకోవడం ఏమిటని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్యే నిజాయతీపరుడైతే చర్చకు ఎందుకు భయపడుతున్నారని.... పోలీసుల అండతో తమను ఎందుకు నిర్బంధిస్తున్నారని నిలదీశారు.


చాలాసేపు రోడ్డుపై బైఠాయించిన నల్లమిల్లిని బలవంతంగా అదుపులోకి తీసుకున్న పోలీసులు.... వ్యాన్‌లో ఆయన్ను ఎక్కించారు. పోలీసు వాహనాన్ని అడ్డుకున్న తెలుగుదేశం కార్యకర్తలు నల్లమిల్లిని తీసుకెళ్లడానికి వీల్లేందంటూ నినదించారు. ఆ తర్వాత కార్యకర్తలను పక్కకు తోసేసి నల్లమిల్లిని కొవ్వూరు పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

Tags

Read MoreRead Less
Next Story