AP : నందిగామలో రూ.3.10 కోట్లతో వినాయకుడికి అలంకరణ

నందిగామ పట్టణంలోని వాసవి మార్కెట్‌లో ప్రతిష్ఠించిన గణపతి విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇక్కడ వినాయకుడిని ఏకంగా రూ.3.10 కోట్ల విలువైన కరెన్సీ నోట్లతో అలంకరించారు. వాసవి మార్కెట్ గణపతి కమిటీ 43వ వార్షిక ఉత్సవాలను పురస్కరించుకుని ఈ అద్భుతమైన అలంకరణను ఏర్పాటు చేసింది. మండపం, వినాయకుడి విగ్రహాన్ని వివిధ డినామినేషన్ల కరెన్సీ నోట్లతో చూడచక్కగా అలంకరించడంతో భక్తులు, సందర్శకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. కరెన్సీ నోట్లతో అలంకరించిన గణపతిని చూసేందుకు వచ్చిన భక్తులు ప్రత్యేక పూజలు చేసి, తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ప్రతి ఏటా వినాయక చవితి సందర్భంగా ఈ కమిటీ ఏదో ఒక ప్రత్యేకతతో గణేశ్ మండపాన్ని ఏర్పాటు చేస్తుందని, ఈసారి కరెన్సీ నోట్ల అలంకరణతో ఆ సంప్రదాయాన్ని కొనసాగించారని స్థానికులు తెలిపారు. ఈ అలంకరణ కోసం ఉపయోగించిన నోట్లన్నీ భద్రతకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు కమిటీ సభ్యులు తెలియజేశారు. ఈ విశేషమైన గణపతి దర్శనం కోసం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com