కృష్ణా జిల్లాలో మున్సిపల్‌ అధికారుల 'చెత్త' నిర్ణయం

కృష్ణా జిల్లాలో మున్సిపల్‌ అధికారుల చెత్త నిర్ణయం
మున్సిపల్‌ అధికారులు తీసుకున్న ఓ చెత్త నిర్ణయం కృష్ణా జిల్లాలో వివాదాస్పదమైంది. విజయవాడ, పెనమలూరు, ఉయ్యూరులోని ప్రభుత్వ బ్యాంకుల ముందు ఉదయం చెత్తకుప్పలు దర్శనమిచ్చాయి.

మున్సిపల్‌ అధికారులు తీసుకున్న ఓ చెత్త నిర్ణయం కృష్ణా జిల్లాలో వివాదాస్పదమైంది. విజయవాడ, పెనమలూరు, ఉయ్యూరులోని ప్రభుత్వ బ్యాంకుల ముందు ఉదయం చెత్తకుప్పలు దర్శనమిచ్చాయి. ఇది ఎవరో ఆకతాయిలు చేసిన పని కాదు. సాక్షాత్తూ మున్సిపల్‌ సిబ్బందే ఇలా చెత్త తీసుకొచ్చి బ్యాంకుల ముందు పడేశారు.

ఇంతకీ దీనికి కారణమేంటో తెలుసా.. బ్యాంకులు ప్రభుత్వ పథకాలకు సహకరించకపోవడమట. ఇదే విషయాన్ని వెల్లడిస్తూ పోస్టర్లు కూడా అంటించారు. ఉయ్యూరులో అయితే ఏకంగా నగర పంచాయితీ కమిషనర్‌ పేరిటే పోస్టర్లు ఉన్నాయి..

ఆంధ్రా బ్యాంక్‌, సిండికేట్‌ బ్యాంక్‌, స్టేట్‌ బ్యాంక్‌, ఇలా అనేక బ్యాంకుల ముందు ఇలా చెత్త కుప్పలు వెలిశాయి. ఉదయం విధులకు హాజరైన సిబ్బంది, లావాదేవీల కోసం వచ్చిన ఖాతాదారులు చెత్త కుప్పలను చూసి అవాక్కయ్యారు. అక్కడే అంటించి ఉన్న నోటీసులు చూసి ముక్కున వేలేసుకున్నారు. మున్సిపల్‌ అధికారులు చేసిన చెత్త పనిని తీవ్రంగా విమర్శించారు.

వివాదం ఏదైనా ఉంటే.. బ్యాంకు మేనేజర్లతో మాట్లాడాలి గానీ కరోనా సమయంలో ఇలా చెత్త కుప్పలు తెచ్చి పడేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. చివరికి ఈ విషయం మీడియా దృష్టికి రావడంతో మున్సిపల్‌ అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే బండ్లను పంపి హడావుడిగా చెత్తను ఎత్తించారు.



Tags

Read MoreRead Less
Next Story