భోగాపురం ఎయిర్‌పోర్ట్ భూసేకరణకు వచ్చిన అధికారులను అడ్డుకున్న బాలిక..!

భోగాపురం ఎయిర్‌పోర్ట్ భూసేకరణకు వచ్చిన అధికారులను ఓ బాలిక అడ్డుకున్న తీరు కన్నీరు పెట్టిస్తోంది. తల్లి చనిపోతే పిల్లలకు ఎంత బాధ ఉంటుందో.. మా భూములను తీసేసుకున్నా అంతే బాధ కలుగుతుందంటూ అధికారులను వేడుకుంది. ఎయిర్‌పోర్టు కోసం ఇంకేమైనా భూములను తీసుకోండి తప్పితే తమ భూములను తీసుకోవద్దంటూ అధికారులను బతిమిలాడింది.
తమ భూములను తీసుకోవద్దంటూ అక్కడున్న గిరిజనులు సైతం.. అధికారులకు దండాలు పెడుతూ వేడుకున్నారు. తమను అడక్కుండా తమ భూములను ఎలా తీసుకుంటారంటూ.. చెట్లను పట్టుకుని కదలకుండా నిల్చున్నారు.
భోగాపురం ఎయిర్‌పోర్టుకి అవసరమైన అదనపు భూసేకరణ సర్వేకు అధికారులు సిద్ధమవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఎయిర్‌పోర్ట్ అప్రోచ్ రహదారికి అవసరమైన సుమారు 130 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేశారు అధికారులు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య సర్వేకి వచ్చారు.
తమని కనీసం సంప్రదించకుండా భూసేకరణకు సిద్ధమవడం పట్ల రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సర్వేకు వచ్చిన అధికారులను గిరిజన రైతులు అడ్డుకుంటున్నారు. జీవనాధారం అయిన భూములను లాక్కుంటే తమ పరిస్థితి ఏంటని బైరెడ్డిపాలెం గ్రామస్తులు ప్రశ్నించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com