AP: నెరవేరనున్న పేదల కల

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి త్వరలో ఏడాది పూర్తి కానుంది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఊహించని స్థాయిలో విజయం సాధించి, 175 స్థానాలలో 164 స్థానాల్లో విజయం సాధించింది. జూన్ 12, 2024న నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఏడాది జూన్ 12న ఎన్డీఏ ప్రభుత్వ పాలనకు సంవత్సరం పూర్తి కానున్న నేపథ్యంలో, రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్తను అందించనుంది. మూడు లక్షల పేదలకు ఇళ్లను అందిస్తూ, అదేరోజు వారితో గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఇళ్ల నిర్మాణంపై చర్యలు వేగవంతం
ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ఇళ్ల నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు 1.70 లక్షల ఇళ్లు పూర్తయ్యాయి. మరో 60 వేల ఇళ్లు తుది దశలో ఉన్నాయి. మిగిలిన ఇళ్ల నిర్మాణాలను గడువులోగా పూర్తిచేయడానికి ప్రభుత్వం అదనపు సాయం అందిస్తోంది.
ప్రతిరోజూ సమీక్ష
ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలన్న లక్ష్యంతో హౌసింగ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ నిత్యం జిల్లా కలెక్టర్లు, గృహ నిర్మాణ శాఖ అధికారులుతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. నిర్మాణ పురోగతిని అనుసరించేందుకు తగిన సూచనలు, సలహాలు అందిస్తున్నారు. ఇళ్ల నిర్మాణంలో నాణ్యతతో పాటు సమయపాలనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. గృహప్రవేశం కార్యక్రమాన్ని జూన్ 12న రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ నిర్ణయం పేద ప్రజల ఆశలకు వెలుగు నింపనుండగా, ఎన్డీఏ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పరంగా తీసుకుంటున్న చిత్తశుద్ధిని మరోసారి చూపిస్తున్నదిగా విశ్లేషకులు భావిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com