AP : చిక్కుల్లో గోరంట్ల మాధవ్.. వాసిరెడ్డి పద్మ చేసిన ఆరోపణలు ఇవే

వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు విజయవాడ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఓ పోక్సో కేసులో బాధితురాలి పేరును ఆయన బయటకు చెప్పారని వాసిరెడ్డి పద్మ 2024 నవంబర్లో ఫిర్యాదు చేశారు. దీంతో మాధవ్ పై 72, 79 బిఎన్ఎస్ కింద కేసు నమోదు చేశారు. వచ్చే నెల 5న సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. గురువారం మాజీ ఎంపీ నివాసానికి పోలీసులు వచ్చారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున మాధవ్ నివాసం వద్దకు చేరుకున్నారు. అనవసరంగా కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని, న్యాయపోరాటం ద్వారా వాటిని ఎదుర్కొంటామని ఈ సందర్భం గా వైసీపీ నాయకులు తెలిపారు. పోలీస్ అధికారిగా ఉన్న మాధవ్ కు చట్టం గురించి తెలియదా అని టీడీపీ నేతలు ప్రశ్నించారు. పోక్సో కేసులో బాధితుల పేర్లను ప్రస్తావించడం చట్టరీత్యా నేరమని దీనిపై పోలీసు విచారణ సాగుతోంది తప్ప తమ ప్రభుత్వం వేధింపులకు పాల్పడటం లేదని టీడీపీ నేతలు పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com