Gorantla Madhav: న్యూడ్ వీడియో కాల్‌పై క్లీన్‌చిట్.. ఫోరెన్సిక్‌కు పంపకముందే..

Gorantla Madhav: గోరంట్ల వీడియో నకిలీదా, అసలుదా? సోషల్ మీడియాలో తిరుగుతున్న న్యూడ్ వీడియోను ఫోరెన్సిక్‌కు పంపారా, పంపలేదా? ఈ విషయంలో ప్రభుత్వమే కన్ఫ్యూజన్‌లో ఉంది. ఆ మాటకొస్తే ఎంపీ గోరంట్ల మాధవ్ కూడా అయోమయంలో ఉన్నారు. అసలు ఇవేమీ తేలకుండానే.. ఎస్పీ ఫకీరప్ప మీడియా ముందుకొచ్చి అదంతా ఫేక్ అని తేల్చేశారు. మంగళవారం మీడియా ముందుకొచ్చిన హోంమంత్రి తానేటి వనిత తమ పార్టీ ఎంపీ మాధవ్ వీడియోను ఫోరెన్సిక్‌కు పంపామని చెప్పారు. అందులో కనిపించేది నిజమని తేలితే గనక చర్యలు తీసుకుంటామన్నారు.
అంతకు ముందు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియోను ఫోరెన్సిక్‌కు పంపించేశామని.. తప్పు తేలితే చర్యలు కఠినంగా ఉంటాయన్నారు. అంతెందుకు, సాక్షాత్తు ఎంపీ గోరంట్ల మాధవ్.. సోషల్ మీడియాలో తిరుగుతున్న న్యూడ్ వీడియోను ఫోరెన్సిక్‌కు పంపామని స్వయంగా స్టేట్‌మెంట్ ఇచ్చారు. కాని, ఈ ముగ్గురు స్టేట్‌మెంట్లు తప్పని చెబుతూ.. అనంతపురం ఎస్పీ ఫకీరఫ్ప మాత్రం అసలు వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపలేమని తేల్చేశారు. న్యూడ్ వీడియో గోరంట్లదా కాదా అని తేల్చాల్సింది ఫోరెన్సిక్ రిపోర్టే.
కాని, వీడియోను అసలు ఫోరెన్సిక్‌కే పంపించకుండా.. ఆ వీడియో ఫేక్ అని ఎలా తేలుస్తారంటూ ప్రశ్నిస్తున్నాయి ప్రతిపక్షాలు. సోషల్ మీడియాలో తిరుగుతున్న వీడియో గోరంట్ల మాధవ్ ఒరిజినల్ వీడియో కాదని ఎస్పీ ఫకీరప్ప చెప్పడం అందరూ నవ్వుకునేలా ఉందంటున్నారు ప్రతిపక్ష నేతలు. ఎవరో కొంతమంది ఆ వీడియోకు ఎంపీ గోరంట్ల ఫొటో జతచేసి ఫార్వర్డ్ చేశారని ఫకీరప్ప వివరించారు. ఒక ఎస్పీ అయి ఉండి, మరీ ఇలాంటి సమాధానాలు చెబుతారా అంటూ మండిపడుతున్నారు విపక్ష నేతలు. నిందితులను రక్షించేందుకు ఎస్పీలు ఎందుకు అంత తాపత్రయపడుతున్నారో అర్థం కావడం లేదంటున్నారు.
మొన్న ఎమ్మెల్సీ అనంతబాబు విషయంలోనూ, మంత్రి కాకాణి ఫైల్స్ దొంగతనం సమయంలోనూ, ఇప్పుడు ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియోపైనా ఎస్పీలు నిందితుల తరపున వకాల్తా పుచ్చుకున్నట్టు, వారిని రక్షించడానికే ఉన్నట్టు ఎస్పీలు మాట్లాడుతున్నారంటూ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. నిజానికి ఎంపీ గోరంట్ల మాధవ్ ఫోన్ సీజ్ చేసి.. ఫోరెన్సిక్‌కు పంపిస్తే నిజాలేంటో బయటికొస్తాయి. కాని, అలా చేయడం చట్ట ప్రకారం సాధ్యం కాదని ఎస్పీ చెప్పుకొచ్చారు. బాధితులే వచ్చి ఫిర్యాదు చేయాలన్నారు.
ఈ వీడియోలో బాధితులుగా ఉన్నది ఎంపీ గోరంట్ల మాధవే. తాను ఏ తప్పూ చేయలేదని నిరూపించుకోవాల్సిందీ వైసీపీ ఎంపీ గోరంట్లనే. అలాంటప్పుడు తన ఫోన్‌ను ఫోరెన్సిక్‌కు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నారు. ఆ న్యూడ్ కాల్ వీడియో వైసీపీ ఎంపీది కావడం వల్లే, నిజాలు బయటకు వస్తాయనే.. తన ఫోన్‌ను ఫోరెన్సిక్‌కు ఇవ్వడానికి గోరంట్ల మాధవ్ భయపడుతున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com