Andhra Pradesh : గ్రూప్-2 వాయిదా వేయాలని ప్రభుత్వం ఆదేశం

ఏపీలో రేపు జరగాల్సిన గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని APPSCని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. రోస్టర్ విధానంలో లోపాలున్నాయంటూ కొద్ది రోజులుగా అభ్యర్థులు చేసిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంది. అటు రోస్టర్ అంశంపై కోర్టులో ఉన్న పిటిషన్ విచారణ మార్చి 11న జరగనుండగా, అప్పటి వరకు వేచి చూడాలని ప్రభుత్వం భావిస్తోంది.
కాగా, గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయాలని, రోస్టర్ విధానంలో మార్పులు చేయాలంటూ అభ్యర్థులు కొద్దిరోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. ఈ విషయంపై అభ్యర్థులు హైకోర్టుకు వెళ్లగా.. పరీక్షలను నిలిపి వేయడాన్ని నిరాకరిస్తూ సింగిల్ జడ్జి ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గ్రూప్-2 అభ్యర్థులు పెద్దఎత్తున నిరసనలకు దిగారు.
విశాఖపట్నం, హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాల్లో రోడ్డెక్కి ఆందోళనలు చేశారు. 2023 డిసెంబరు 7వ తేదీన ఏపీపీఎస్సీ ఇచ్చిన నోటిఫికేషన్ సుప్రీంకోర్టు తీర్పు, ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవో 77కి విరుద్ధంగా ఉందని, ఈ విషయాన్ని సింగిల్ జడ్జి విస్మరించారని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com