Bapatla : వాలంటీర్ అసహనం.. సర్వే పేపర్లు తగలబెట్టాడు...!
Bapatla : ముఖ్యమంత్రి జగన్ ఇష్టపడి తెచ్చుకున్న వాలంటీర్ వ్యవస్థ ప్రభుత్వానికే వ్యతిరేకంగా మారుతోందా..? బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం భట్టిప్రోలు మండలంలో ఓ వాలంటీర్ అసహనం కట్టలు తెంచుకుంది.. ప్రభుత్వం, అధికారులు తమతో గొడ్డు చాకిరీ చేయించుకుంటున్నారని గౌస్ బాషా అనే వాలంటీర్ సర్వే లిస్టును తగలబెట్టాడు.. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమానికి సంబంధించి సంక్షేమ లబ్దిదారుల జాబితా తయారు చేయాలని అధికారులు వాలంటీర్‌కు ఆదేశాలు ఇచ్చారు.
అయితే, ఒంట్లో బాగోలేదన్నా సర్వే చేయాల్సిందేనని చెప్పడంతో విసిగిపోయిన గౌస్ బాషా అధికారులు ఇచ్చిన సర్వే లిస్ట్‌ని మంటల్లో తగలబెట్టాడు.. సర్వే పేపర్లు తగలబడుతున్న దృశ్యాన్ని వీడియో తీసి వాలంటీర్ అధికారులు ఉన్న గ్రూపులో పోస్ట్ చేశాడు.. తమతో గొడ్డు చాకిరీ చేయించుకుంటే ఫ్రస్ట్రేషన్ ఇలాగే ఉంటుందంటూ గ్రూప్‌లో పోస్ట్ చేశాడు గౌస్ బాషా.
కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించామని.. అయినా ప్రభుత్వం కనీస కృతజ్ఞత కూడా చూపించడం లేదని వాపోయాడు.. పని ఒత్తిడి తట్టుకోలేక తన రాజీనామా పత్రాన్ని ఎంపీడీవోకు అందజేసినట్లు చెప్పాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com