CBN: అభిమాన సంద్రం

CBN: అభిమాన సంద్రం
హైదరాబాద్‌లో చంద్రబాబుకు ఘన స్వాగతం... దారిపొడవునా జన సునామి

మధ్యంతర బెయిల్‌పై వచ్చిన చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్‌లో మాదిరే హైదరాబాద్‌లోనూ అపూర్వ స్వాగతం లభించింది. గన్నవరం నుంచి విమానంలో..... హైదరాబాద్‌ బేగంపేట విమానాశ్రయం చేరుకున్న చంద్రబాబును చూసేందుకు... తెలుగుదేశం నాయకులు, పార్టీ కార్యకర్తలు, ఐటీ ఉద్యోగులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.జైబాబు జైజై చంద్రబాబు అని నినాదాలతో హోరెత్తించారు."వుయ్ ఆర్ విత్ చంద్రబాబు", "మేము సైతం బాబు కోసం", "సైకో పోవాలి-సైకిల్ రావాలి" అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. చంద్రబాబుపై పూల వర్షం కురిపించారు. విమానాశ్రయం నుంచి బయటకు వచ్చిన చంద్రబాబుకు వెల్లువెత్తిన అభిమాన సంద్రాన్ని దాటుకుని ముందుకు సాగడం కష్టతరమైంది. అభిమానులను పక్కకు పంపి.. చంద్రబాబు వాహనశ్రేణిని ముందుకు పంపడానికి పోలీసులు చాలా శ్రమించాల్సి వచ్చింది.


ఎయిర్‌పోర్ట్‌ లోపలి నుంచి చంద్రబాబు వాహనశ్రేణి ప్రధాన రహదారిపైకి రావడానికే గంటకుపైగా పట్టింది. వేలాది మంది యువకులు బైకులపై చంద్రబాబు వాహనశ్రేణిని అనుసరిస్తూ, హారన్ మోగిస్తూ.... కాన్వాయ్ వెంట వెళ్లారు. ప్రధాన రహదారిపైకి వచ్చాక కూడా అదే పరిస్థితి నెలకొంది. మళ్లీ చంద్రబాబు పాలన వస్తేనే ఏపీ బాగుపడుతుందని అభిమానులు, ఐటీ నిపుణులు అభిప్రాయపడ్డారు. చంద్రబాబు కోసం తరలివచ్చిన అభిమానులను చూసి తెలుగుదేశం నేతలు సైతం ఆశ్చర్య పోయారు. చంద్రబాబు నిజమైన నాయకుడని.... అందుకే ఆయనకు మద్దతుగా అందరూ తరలివస్తున్నారని నాయకులు అభిప్రాయపడ్డారు. కోర్టు నిబంధనల మేరకు కారు లోపలే ఉన్న చంద్రబాబు తెలుగుదేశం నాయకులు, అభిమానులకు అభివాదం చేస్తూ జూబ్లీహిల్స్‌లోని నివాసానికి చేరుకున్నారు. ఇవాళ AIG ఆసుపత్రిలో చంద్రబాబు వైద్య పరీక్షలు చేయించుకుంటారు. తర్వాత ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి వెళ్లి కాటరాక్ట్ ఆపరేషన్ నిమిత్తం వైద్యులను సంప్రదించనున్నారు.


బేగంపేట విమానాశ్రయం రన్‌వేపై ల్యాండ్‌ అయిన వెంటనే బయట ఉన్న తెదేపాశ్రేణులు, అభిమానులు పెద్దపెట్టున నినాదాలు చేశారు. ‘మేము సైతం బాబు కోసం’, ‘జై సీబీఎన్‌’ అంటూ విమానాశ్రయ పరిసరాలను హోరెత్తించారు. తనకోసం వచ్చిన అభిమానులు, పార్టీ శ్రేణులకు కారు లోపల నుంచే చంద్రబాబు అభివాదం చేశారు. బాబు వెంట ఆయన సతీమణి నారా భువనేశ్వరి, మధుసూదన్‌రావు, రాజగోపాల్‌ తదితరులు ఉన్నారు. నత్‌నగర్‌ నియోజకవర్గంలోని జెక్‌కాలనీ, సుందర్‌నగర్‌, మోడల్‌కాలనీల నుంచి వచ్చిన పలువురు చంద్రబాబునాయుడు అభిమానులు, కాలనీల ప్రతినిధులు సురేష్‌ చౌదరి, మాచారావు, జి.పి.రావు తదితరుల ఆధ్వర్యంలో మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో అనుసరించారు.వాహన శ్రేణిపై అడుగడుగునా పూల వర్షం కురిపించారు.

Tags

Read MoreRead Less
Next Story