AP: గుంటూరు రైతులకు రాని నమ్మకం

AP: గుంటూరు రైతులకు రాని నమ్మకం
X
ఖరీఫ్‌ ఆశాజనకం అని చెప్పిన వాతావరణ శాఖ... గుంటూరులో పూడిపోయిన మేజర్‌ కాలువలు

వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఖరీఫ్‌ ఆశాజనకం అని భరోసా ఇచ్చింది. కానీ, ఉమ్మడి గుంటూరు జిల్లా రైతులకు ఎక్కడో నమ్మకం కుదరడం లేదు. పంటపొలాలకు నీరు అందించాల్సిన మేజర్‌ కాలువలన్నీ పూడిపోయాయి. ఏది చూసినా ముళ్లచెట్లు, తూటికాడతో అధ్వానంగా తయారయ్యాయి. గత ఐదేళ్లుగా కాల్వలు శుభ్రం చేయకపోవడంతో ఈ ఏడాది చివరి భూములకు సాగునీరు అందడం ప్రశ్నార్థకంగా మారింది.

నైరుతి రుతుపవనాలు ఈ నెలాఖరుకే వచ్చే అవకాశం ఉందని, ఆగస్టు-సెప్టెంబర్‌లో అధిక వర్షపాతం నమోదు కావచ్చని వాతావరణశాఖ అంచనా. గతేడాది వర్షాభావ పరిస్థితులతో అల్లాడిన రైతులకు ఇది నిజంగా కొండంత ఊరటనిచ్చేదే. అందుకే అన్నదాతలు కొత్త ఆశలతో దుక్కులు దున్ని పొలాలను సాగుకు సిద్ధం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కానీ పంటకాలువల వైపు చూసి మళ్లీ దిగాలుపడుతున్నారు. నాగార్జున సాగర్‌, డెల్టా, గుంటూరు చానల్‌ పరిధిలోని పంట కాల్వలు అస్తవ్యస్థంగా తయారయ్యాయి. తూటికాడ, గుర్రపు డెక్క, కంపచెట్ల నిండిపోయాయి. గుంటూరు, పెదనందిపాడు, నకిరికల్లు, డెల్టా ప్రధాన బ్రాంచ్‌ కాలువల పరిధిలో మైనర్ కాలువలకు పూడిక తీసి, మరమ్మతులు చేయకపోతే సాగు కష్టమేనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉమ్మడి జిల్లాలో కొంత మేర ప్రధాన కాలువల ఆధునీకరణ పనులు చేపట్టారు. వైసీపీ ఏలుబడిలో కనీసం కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. దశాబ్దాల క్రితం అమర్చిన షట్టర్లు ధ్వంసమయ్యాయి. ఆయకట్టుకు నీరందక రైతులు ఇష్టానుసారంగా మేజర్లపై అక్రమ తూములు ఏర్పాటు చేసుకోవడంతో చివరి భూములకు నీరు అందడంలేదు. పాలడుగు, నరుకుళ్లపాడు, బండారుపల్లి మేజర్ కాలువల పరిధిలోని వేల ఎకరాల్లోని పంటలకు సాగునీరు అందే పరిస్థితి కనిపించడంలేదు. డ్రెయిన్ల పూడికతీత పనులు చేపట్టాలని.. రైతులు మొత్తుకుంటున్నా ప్రయోజనం లేకుండాపోతోంది. సత్తెనపల్లి పరిధిలోని.... అమరావతి మేజర్‌ కాల్వపై ఉన్న డ్రాప్‌లు శిథిలావస్థకు చేరాయి. గుంటూరు బ్రాంచ్‌ కెనాల్‌పై కొన్ని ప్రాంతాల్లో కాల్వకట్టలు కోతకు గురయ్యాయి. సత్తెనపల్లి మండలంతోపాటు పెదకూరపాడు నియోజకవర్గంలోని గ్రామాల్లో చివరి భూములకు సాగర్‌ కాల్వ ద్వారా నీరందక రైతులుఇబ్బందిపడుతున్నారు.మేడికొండూరుకాల్వలుపూడిపోయాయి. కొండవీటి మేజర్‌కాల్వ.. ముళ్ల కంప, పిచ్చికంపతో పూడిపోయింది. తాడికొండ మండలంలోని లాం గ్రామం వద్ద ఉన్న కొండవీటి వాగులో తూటుకాడ దట్టంగా పెరిగిపోయింది. మే నెల సగానికి పైగా అయిపోయినా నేటికీ పూడికతీత పనుల ఊసే కనిపించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags

Next Story