HARISH SALVE: స్కిల్‌ కేసు మూలంలోనే దోషముంది: సాల్వే

HARISH SALVE: స్కిల్‌ కేసు మూలంలోనే దోషముంది: సాల్వే
సుప్రీంకోర్టులో సమర్థంగా వాదనలు వినిపించిన హరీష్‌ సాల్వే

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసు అక్రమమంటూ చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. వరుసగా రెండురోజులపాటు ఇరువైపులా సుదీర్ఘ వాదనలు విన్న న్యాయస్థానం విచారణ వాయిదా వేసింది. చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో రెండోరోజూ సుదీర్ఘ విచారణ సాగింది. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేదితో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే.. సీఐడీ తరఫున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. హైకోర్టులో దాఖలు చేసిన పత్రాల ఆధారంగానే వాదనలు జరుగుతున్నప్పుడు కొత్త డాక్యుమెంట్ల అవసరం ఉండదని... జస్టిస్ త్రివేది స్పష్టం చేశారు. క్రిమినల్ కేసుల్లో మళ్లీ కౌంటర్ అఫిడవిట్ల అవసరమేంటని హరీష్ సాల్వే ప్రశ్నించారు. నోటీసులివ్వడం కోర్టు విధానాల్లో భాగమని లేకుంటే మళ్లీ మొదటికొస్తుందని రోహత్గీ అన్నారు. నోటీసులు అవసరం లేదన్న విధివిధానాలపై ఆధారాలున్నాయా అని జస్టిస్ త్రివేది.. హరీష్ సాల్వేను ప్రశ్నించగా.. గతంలో వచ్చిన తీర్పులను బెంచ్ ముందు ఉంచుతామని సాల్వే బదులిచ్చారు.

17-A చట్ట పరిధిలోని అంశాలను హరీష్‌ సాల్వే సుప్రీంకోర్టు ముందు ఉంచారు. యశ్వంత్ సిన్హా కేసులో... రఫేల్ కొనుగోళ్లు, అనంతరం దాఖలైన కేసులపై వచ్చిన తీర్పులను సాల్వే ఉదహరించారు. రఫేల్ కేసులో జస్టిస్ కె.ఎం.జోసెఫ్ తీర్పును సాల్వే ఉదహరించారు. 1988 అవినీతి నిరోధక చట్టం ప్రకారం పోలీసులకు దర్యాప్తు జరిపే హక్కు ఉండదని అది పోలీసుల బాధ్యత మాత్రమేనని హరీష్ సాల్వే కోర్టుకు తెలిపారు. పరిణామాలన్నింటి ప్రకారం కేసు నమోదుకు గవర్నర్ ముందస్తు అనుమతి తప్పనిసరని.. సాల్వే కోర్టుకు చెప్పారు. చంద్రబాబుపై ఆరోపణల విచారణకు ముందే గవర్నర్ అనుమతి తప్పనిసరని అన్నారు. ప్రారంభం చట్టబద్ధం కానప్పుడు కేసు మూలాన్నే తిరస్కరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ కేసు మూలంలోనే దోషం ఉంది కాబట్టి బుల్లర్ కేసును పరిగణనలోకి తీసుకోవాలని బలంగా కోరుతున్నట్లు తెలిపారు.

చంద్రబాబుపై నమోదైన F.I.Rనే తాను సవాల్ చేస్తున్నట్లు సాల్వే అన్నారు. అన్నీ కలిపేసి ఒక FIRను రూపొందించారని దాన్నే తాను సవాల్ చేస్తున్నానని సాల్వే స్పష్టం చేశారు. FIRలో చంద్రబాబు పేరు ఎక్కడా లేదని FIR చట్టబద్ధం కాదన్నారు. డిజైన్ టెక్ సంస్థకు లబ్ధి చేకూర్చడం కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనేది ప్రధాన అభియోగమని సాల్వే గుర్తుచేశారు. టెక్నాలజీ భాగస్వామికి ఆయాచిత లబ్ధి కల్పించాలన్నదే ప్రధాన ఉద్దేశమని... FIRలో ఆరోపించారని తెలిపారు. 164 సెక్షన్ కింద తీసుకున్న వాంగ్మూలం ఆధారంగా కేసును నిర్మించారని... దాన్ని తాము ఛాలెంజ్ చేస్తున్నట్లు సాల్వే తేల్చిచెప్పారు.


Tags

Read MoreRead Less
Next Story