Health Inspector Treatment: రెండ్రోజుల్లో పెళ్లి.. కరోనా బారిన పడి హెల్త్ అసిస్టెంట్ చికిత్సతో..

Health Inspector Treatment: కొత్తగా పెళ్లయిన వాళ్లని, రేపో మాపో పెళ్లి చేసుకోబోతున్న వారినీ ఎవరినీ వదిలిపెట్టట్లేదు కరోనా. కరోనా కాటుకు దేశంలో రోజుకు వేల మరణాలు సంభవిస్తున్నాయి.
పాజిటివ్ కేసులు తగ్గినా మరణాల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఓ విషాదకర సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆ ఇంట రెండ్రోజుల్లో పెళ్లి వేడుక జరగాల్సి ఉంది. కానీ పెళ్లికొడుకే ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.
చింతపల్లి మండలం రాకోట గ్రామానికి చెందిన దేశగిరి రజనీకాంత్ కి మేనమామ కూతురు అర్ల గ్రామానికి చెందిన వంజరి రమాదేవితో పెళ్లి కుదిరింది.
ఈనెల 26న వివాహానికి ముహూర్తాలు పెట్టుకున్నారు ఇరు కుటుంబాల వారు. రజనీకాంత్ పరవాడలో తపాలశాఖలో పని చేస్తున్నాడు. పెళ్లి పనుల నిమిత్తం పరవాడ నుంచి ఈనెల 13న అర్ల గ్రామానికి వచ్చాడు.
అప్పటికే జ్వరంగా ఉండడంతో నర్సీపట్నంలో ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నాడు. 14వ తేదీన గ్రామానికి వచ్చిన హెల్త్ అసిస్టెంట్ హరిబాబు.. రజనీకాంత్ ను చూడా అతడికి కరోనా కాదని, వైరల్ ఫీవర్ అని చెప్పి మూడు రోజుల్లో తగ్గిస్తానని అన్నాడు. ఇందుకు గాను ఫీజు రూపంలో రూ.1500 తీసుకుని ఇంజక్షన్లు ఇచ్చాడు.
సెలైన్ బాటిల్ ఎక్కించాడు. కానీ అప్పటికే పరిస్థితి విషమించింది. దాంతో హరిబాబు అతడిని ప్రైవేట్ ఆస్పత్రికి పంపించాడు. అక్కడ స్కానింగ్, ఇతర పరీక్షలు చేసి ఏరియా ఆస్పత్రికి పంపారు. కానీ లాభం లేకపోయింది. ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడంతో విశాఖ కేజీహెచ్ కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. హెల్త్ అసిస్టెంట్ వైద్యం కారణంగానే రజనీకాంత్ మృతి చెందాడని బంధువులు ఆరోపిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com