Telugu States: రానున్న రెండు రోజులు మండే ఎండలు

తెలంగాణలో రాగల మూడు రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. నేడు, రేపు, ఎల్లుండి కొన్ని జిల్లాలలో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందనీ తెలిపింది. నేడు మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలతో పాటు... రేపు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయని వెల్లడించింది. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ మూడు రోజుల పాటు యెల్లో హెచ్చరికలు జారీ చేసింది. ద్రోణి ఒకటి దక్షిణ విదర్భ నుంచి మరాత్వాడ, ఉత్తర అంతర్గత కర్ణాటక నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు... సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుందనీ ఒక ప్రకటనలో పేర్కొంది. ద్రోణి మన్నార్ గల్ఫ్ నుంచి అంతర్గత తమిళనాడు, రాయలసీమ మీదుగా దక్షిణ తెలంగాణ వరకు... సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుందని చెప్పింది. నేడు, రేపు, ఎల్లుండి కొన్ని జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఏపీలో కూడా ఎండలు మండుతున్నాయి. వడగాలులతో జనం అల్లాడుతున్నారు. దీంతో వీలైనంతవరకు ఇంట్లోనే ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. ఇవాళ 46 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 175 మండలాల్లో వడగాల్పులు వీచినట్లు పేర్కొంది.ద్రోణి ప్రభావంతో కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ద్రోణి.. మన్నార్ గల్ఫ్ నుంచి అంతర్గత తమిళనాడు, రాయలసీమ మీదుగా దక్షిణ తెలంగాణ వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కి. మీ ఎత్తులో కొనసాగుతోందని, దీని ప్రభావంతో బుధ, గురు, శుక్రవారాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
మరోవైపు వడగాడ్పులతో తెలుగు రాష్ట్రాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరాయి. సాధారణం కంటే 4 నుంచి 6 డిగ్రీలు పెరిగాయి. ఏప్రిల్ నెలలోనే ఎండ తీవ్రత ఇలా ఉంటే.. మే, జూన్ నెలల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపునులు అంచనా వేస్తున్నారు. కాగా.. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 9 గంటలకే సూరీడు నిప్పులు చిమ్ముతుండటంతో ప్రజలు అల్లాడుతున్నారు. మరోవైపు వేడిగాలుల తీవ్రత కూడా పెరగడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో బయటకు వెళ్లాలంటేనే జనం జంకుతున్నారు. మధ్యాహ్నం 12 గంటలు దాటితే ప్రధాన రహదారులు, కూడళ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. జాతీయ రహదారులు సైతం వాహనాలు రాకపోకలు లేక ఖాళీగా కనిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉక్కపోతతో వృద్ధులు, చిన్నారులు అవస్థలు పడుతున్నారు. ఈ తరుణంలో వాతావరణశాఖ ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com