AP Heavy Rain : ఏపీకి భారీవర్ష సూచన

ఆంధ్రప్రదేశ్ మళ్లీ రెయిన్ అలర్ట్ జారీచేసింది వెదర్ డిపార్టుమెంట్. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆవర్తనం అల్పపీడనంగా మారనుంది. దీని ప్రభావంతో రాగల నాలుగు రోజులు ఏపీలో వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాగల 36 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఆ తర్వాత అది పశ్చిమ దిశగా తమిళనాడు, శ్రీలంక తీరాలవైపు నెమ్మదిగా కదులుతుందని వెల్లడించింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో భారీ వర్షలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఆవర్తనం అల్పపీడన ప్రభావంతో ఇవాళ కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలలో కొన్నిచోట్ల తేలికపాటి వర్షం కురుస్తుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. నవంబర్ 12న అంటే మంగళవారం నెల్లూరు, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే విశాఖ, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుందని అంచనా వేసింది. నవంబర్ 13నాడు కాకినాడ, కోనసీమ, గోదావరి జిల్లాలు, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్, తిరుపతి జిల్లాలలో కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఎన్టీఆర్, పల్నాడు, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. నవంబర్ 14 గురువారం రోజున గోదావరి జిల్లాలు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, తిరుపతి జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు.. కాకినాడ, కోనసీమ, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుందని హెచ్చరించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com