Heavy Rain Forecast: ఏపీకి ముంచుకొస్తున్న తుఫాన్ ముప్పు..

ఆంధ్రప్రదేశ్ రైతులకు వాయుగుండం ముప్పు ముంచుకు వస్తోంది. కోత దశలో భారీ వర్షాల వల్ల పంటలు దెబ్బతినే ప్రమాదం ఉన్నందున అప్రమత్తంగా వుండమని హెచ్చరికలు జారీ అయ్యాయి. ప్రస్తుతం దక్షిణ బంగాళా ఖాతంలో వున్న వాయుగుండం తమిళనాడు – శ్రీలంక దిశగా కదులుతూ బలపడుతోంది. “దాన” తీవ్ర తుఫాన్ తర్వాత మరోసారి తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష హెచ్చరికలు జారీ అయ్యాయి. దక్షిణ బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్ర రూపం దాల్చింది. వాయువ్య దిశగా గంటకు 18 కిలోమీటర్ల వేగంతో కదులుతూ తమిళనాడు – శ్రీలంకలోని ట్రికోమలి వైపు పయనిస్తుంది. తీవ్ర వాయుగుండం ప్రభావం ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలపై అధికంగా ఉండనుంది. ఈనెల 29న ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల భారీ వర్షాలు నమోదు అవుతాయని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం ప్రకటించింది.
వాయుగుండం ముప్పుకు రైతుల్లో అలజడి కనిపిస్తోంది. ప్రస్తుతం పంటలు కోత దశలో వున్నాయి. వరి ఎక్కడికక్కడ పొలాల్లో వుండిపోయింది. ఈ దశలో భారీ వర్షాలు నమోదైతే నష్టం జరుగుతుంది. బలమైన గాలులు వుంటాయి కనుక నెలకొరిగిపోయే ప్రమాదం వుంది. దీంతో రైతులు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని, యంత్రాంగం తగిన జాగ్రత్తలు చేపట్టడం అవసరమని ఐఎండీ సూచనలు జారీ చేసింది. మరో వైపు, ఆంధ్ర ప్రదేశ్ దిగువ ట్రోపో ఆవరణములో ఈశాన్య గాలులు వీస్తున్నాయి. వాయుగుండం ప్రభావంతో తేలికపాటి నుంచి మొదలయ్యే వర్షాలు క్రమేపీ పెరుగుతాయని ఐఎండీ అంచనా వేస్తుంది. ఇక, ఇప్పటికే ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో.. ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు అధికారులు..
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com