Cyclone Michaung : కోసాంధ్ర జిల్లాల్లో అల్లకల్లోలం

Cyclone Michaung : కోసాంధ్ర జిల్లాల్లో అల్లకల్లోలం
భారీ నుంచి అతి భారీ వర్షాలు

మిగ్‌జాం తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో జోరు వర్షాలు కురుస్తున్నాయి. మిగ్‌జాం తీవ్రతుఫాను ఉత్తర దిశగా కోస్తాంధ్ర తీరానికి సమాంతరంగా కదులుతున్నదని భారత వాతావరణ శాఖ తెలిపింది. తీవ్ర తుఫానులో కొంతభాగం సముద్రంలో ఉందని, మరికొంతభాగం భూమిపై ఉన్నట్లు వెల్లడించింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాను వర్షాలు ముంచెత్తుతున్నాయి. శ్రీకాళహస్తిలో కురుస్తున్న వర్షాలకు సువర్ణముఖి నదికి భారీగా నీరు చేరి పలు రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి. శ్రీకాళహస్తి సమీపంలో లంకమిట్ట కాలనీ వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఏర్పేడు మండలంలోని సిందేపల్లిలో పూరిగుడిసె గోడ కూలి నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. తిరుమలలోనూ ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. ఈదురుగాలుల ధాటికి పలు చోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. మొదటి గోగర్భం జలాశయంలో నీటి మట్టం పెరిగింది. పాప వినాశం, ఆకాశగంగ, శిలాతోరణం,శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గాలను మూసివేశారు. తుపాను ప్రభావంతో.. తిరుపతి నుంచి ప్రయాణించే పలు రైళ్లను రద్దు చేశారు. మరికొన్ని దారి మళ్లించారు. తుపాను ప్రభావంతో ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. నెల్లూరులో రహదారులన్నీ చెరువుల్ని తలపిస్తున్నాయి. పలు కాలనీలు నీట మునిగాయి. అనేక మండలాల్లో పంటలు నీట మునిగాయి. నిజాంపట్నం ఫిషింగ్‌ హార్బర్‌ వద్ద ఏడో నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రకాశం జిల్లా కొత్తపట్నం, సింగరాయకొండ, టంగుటూరు, నాగులప్పలపాడు మండలాల్లో రోడ్లు నీట మునిగాయి. పొగాకు, శనగ పంటలకు నష్టం వాటిల్లుతుందని రైతులు వాపోతున్నారు.


కృష్ణా జిల్లాను వర్షాలు ముంచెత్తుతున్నాయి. దివిసీమ, మచిలీపట్నం, బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల్లో వర్షాలు కురుస్తున్నాయి. నాగాయలంక, కోడూరు మండలాలకు సరిహద్దుగా బంగాళాఖాతంవైపు ఉన్న కరకట్ట పూర్తిగా దెబ్బతినడంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. పాలకాయతిప్ప, హంసలదీవి, ఊటగుండం, బసవానిపాలెం వాసుల్ని పునరావాస కేంద్రాలకు తరలించారు. కోనసీమ జిల్లా వ్యాప్తంగా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. వరి చేలు నేల వాలుతున్నాయి. సుమారు 60 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం రాశుల రూపంలో కళ్ళాల్లో ఉంది. ధాన్యం తడిసిపోకుండా రైతులు బరకాలు కప్పి రక్షణ చర్యలు చేపట్టారు. తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి విజయనగరంజిల్లా వ్యాప్తంగా తేలికపాటి వర్షం కురుస్తోంది. ఈ మధ్యాహ్నం నుంచి విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. మిచౌంగ్ తుఫాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో చిరుజల్లులు పడడంతో కోసిన పంటను రక్షించుకునేందుకు రైతులు తంటాలు పడుతున్నారు.


భారత వాతావరణ విభాగం-IMD వెల్లడించింది. తీరం దాటే సమయంలో గంటకు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముంది. కోస్తాంధ్ర జిల్లాల్లో ఇప్పటికే గంటకు 75 కిలోమీటర్లవేగంతో గాలులు వీస్తున్నట్టు తెలిపింది. తీరాన్ని దాటిన అనంతరం తుపానుగా బలహీనపడనున్న మిగ్ జాం తెనాలి,విజయవాడ మీదుగా కదిలే అవకాశముంది. ఆ సమయంలో ఈదురుగాలు, భారీ వర్షం వల్ల చెట్లు,హోర్డింగ్‌లు నేలకొరిగే ప్రమాదంఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణసంస్థ హెచ్చరించింది.

Tags

Next Story