Rain Alert : ఇవాళ రేపు ఏపీలో ఈ జిల్లాల్లో భారీవర్ష సూచన
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ తీవ్ర అల్పపీడనంగా బలపడనుంది. తర్వాతి 48 గంటల్లో మరింత బలపడి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ కోస్తా తీరాల వైపు కదులుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం చెప్పింది. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని తెలిపింది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడతాయని వాతావరణశాఖ ప్రకించింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రత వేగంగా పెరుగుతోందని ఐఎండీ అంచనా వేస్తోంది. రేపటికి తీవ్ర తుపానుగా మారి , చెన్నైకి దక్షిణంగా తీరం దాటవచ్చని సూచించింది. తీరం దాటిన తర్వాత బలహీనపడి, అరేబియా సముద్రంలోకి వెళ్లి మళ్లీ అతి తీవ్రతుపానుగా బలపడుతుందనే అంచనాలున్నాయి. ఇది కేవలం అల్పపీడనంగానే దక్షిణ కోస్తాలో తీరం దాటొచ్చని కొన్ని వాతావరణ నమూనాలు అంచనా వేస్తున్నాయి. దీనిపై బుధవారం నాటికి స్పష్టత వస్తుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
రేపు రెండు, మూడు చోట్ల అత్యంత భారీ వర్షాలకు అవకాశముంది. తీరప్రాంత జిల్లాల్లో గంటకు గరిష్ఠంగా 55 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని ప్రకటించింది. గురువారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని, ఇప్పటికే సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులు ఒడ్డుకు తిరిగి రావాలని సూచించారు. ఈ నేపథ్యంలోనే ఈ నేపథ్యంలో ప్రకాశం, నెల్లూరు, బాపట్ల జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com