AP: ఏపీకి భారీ వర్ష సూచన

AP:  ఏపీకి భారీ వర్ష సూచన
X
విస్తారంగా వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ.. అప్రమత్తమైన ప్రభుత్వం

నైరుతి బంగాళాఖాతంలో ఈనెల 14న అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. తమిళనాడు, ఏపీ తీరాల వెంబడి ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని స్పష్టం చేసింది. దీని ప్రభావంతో ఈ నెల 14, 15, 16వ తేదీల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సోమవారం నుంచి మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. అటు, శనివారం సాయంత్రం నాటికి ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో 64 మి.మీ, బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెంలో 54.7 మి.మీ, నంద్యాల జిల్లా చాగలమర్రిలో 47.7 మి.మీ, ఏలూరు జిల్లా చాట్రాయిలో 39.5 మి.మీ, అన్నమయ్య జిల్లా మదనపల్లిలో 38.5 మి.మీల చొప్పున వర్షపాతం నమోదైంది.

ప్రభుత్వం అప్రమత్తం

భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై అన్ని జిల్లాల కలెక్టర్లకు సమాచారం అందించింది. అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి అనిత ఆదేశించారు. పోలీస్, విపత్తు నిర్వహణ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. కంట్రోల్ రూమ్, హెల్ప్ లైన్లు ఏర్పాటు చేయాలని అధికార యంత్రాంగానికి సూచించారు. బలహీనంగా ఉన్న చెరువులు, కాలువ గట్లను పటిష్టం చేయాలని సంబంధిత అధికారులకు నిర్దేశించారు. ఏలూరు, ప్రకాశం, ప.గో, పల్నాడు, సత్యసాయి జిల్లాల కలెక్టర్లు సైతం ముందస్తు చర్యలు చేపట్టాలని.. వాగులు పొంగే అవకాశమున్న ప్రాంతాల్లో రైతులు, గొర్రెల కాపరులు, మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేయాలన్నారు. రెవెన్యూ, మున్సిపల్, నీటి పారుదల శాఖ, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సమన్వయంతో ఆస్తి, ప్రాణ నష్టం కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు. అత్యవసర సహాయక చర్యల కోసం కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. ఏదైనా సమస్య ఉంటే కంట్రోల్ రూం టోల్ ఫ్రీ నెంబర్లు 1070, 112, 1800 425 0101 ను సంప్రదించాలని సూచించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. పొంగిపొర్లే వాగులు, కాలువలు, రోడ్లు, కల్వర్టులు, మ్యాన్ హోల్స్‌కు దూరంగా ఉండాలని సూచించింది.

కొల్లాపూర్‌లో 107.06 మి. మీ వర్షపాతం నమోదు

కొల్లాపూర్ నియోజకవర్గంలో 107.06 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. పెద్దకొత్తపల్లి మండలంలో 43.2 మి. మీ, కోడేరులో 29.4 మి. మీ, కొల్లాపూర్లో 20.0 మి. మీ, పెంట్లవెల్లి మండలంలో 15.0 మి. మీ నమోదైందని ఏఎస్వో నరేందర్ తెలిపారు. వర్షాలు పడడంతో పత్తి పంట రైతులు ఆందోళన చెందుతున్నారు. రోడ్లన్నీ బురదమయంగా మారాయి.

భారీవర్షానికి మునిగిన పోతినవారిపాలెం చప్టా

కారంచేడు మండలం పోతినవారి పాలెం గ్రామం వద్ద ఉన్న ప్రధాన రహదారి చప్టా వరద ముంపునకు గురైంది. స్థానికంగా గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షంతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరద నీరు చేరడంతో ఈ చప్టా పూర్తిగా మునిగిపోయింది. ఆదివారం నాడు తెల్లవారుజామున నుంచి వరద ఉధృతి పెరిగి చప్టాపై మూడు అడుగుల పైగా నీరు చేరడంతో ప్రజల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Tags

Next Story