Chittoor Rains : జనజీవనం అస్తవ్యస్తం..!

Chittoor Rains : చిత్తూరు జిల్లాలో జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి వరదలు. వాగులు, వంకలు, రిజర్వాయర్లు పొంగి ప్రవహిస్తున్నాయి. అనేక చెరువులకు గండ్లు పడ్డాయి. పలు రహదారులు నీటమునిగి రాకపోకలు నిలిచిపోయాయి. తిరుమల, తిరుపతిలో వరద ఉధృతంగా ప్రవహిస్తుంది. తిరుమలలోని గోగర్భం డ్యాం, పాపనాశనం డ్యాం నిండిపోయాయి. దీంతో డ్యాం గేట్లు ఎత్తి నీటిని కిందికి విడుదల చేశారు.
ఆ నీటితో పాటు.. కొండల్లో నుంచి వచ్చే వరద తిరుపతి కపిలతీర్థాన్ని ముంచెత్తింది. కపిలేశ్వరస్వామి ఆలయం వరద నీటితో నిండిపోయింది. ఆ వరద నీరు తిరుపతి నగరాన్ని ముంచెత్తింది. చిత్తూరు-తిరుపతి సిక్స్ లేన్ హైవేపై పూతలపట్టు మండలం పి.కొత్తకోట రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద ఐదడుగుల నీరు ప్రవహించి లారీ, పలు కార్లు నీటిలో చిక్కుకుపోయాయి.
జిల్లాలో 540 గ్రామాలకు ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. అధికారులు రెండు రోజుల పాటు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. తడ-సూళ్లూరుపేట మార్గంలో వరద ఉధృతితో తిరుపతికి రావాల్సిన.. వెళ్లాల్సిన రైళ్లు రద్దయ్యాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com