Asani Cyclone: వాయుగుండంగా మారిన అసని తుఫాన్ .. ఇవాళ కోస్తాంధ్రలోని పలు చోట్ల భారీవర్షాలు

Asani Cyclone:  వాయుగుండంగా మారిన అసని తుఫాన్ .. ఇవాళ కోస్తాంధ్రలోని పలు చోట్ల భారీవర్షాలు
Asani Cyclone: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ అసని తుపాన్ బలహీనపడింది. కృష్ణాజిల్లా కృత్తివెన్ను సమీపంలో తీరాన్ని దాటింది.

Asani Cyclone: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ అసని తుపాన్ బలహీనపడింది. కృష్ణాజిల్లా కృత్తివెన్ను సమీపంలో తీరాన్ని దాటింది. భూభాగాన్ని తాకిన అనంతరం బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారినట్లు వాతావరణ శాఖ స్పష్టంచేసింది. మచిలీపట్నానికి 21 కిలోమీటర్లు, కాకినాడకు 130 కిలోమీటర్ల, విశాఖ 272 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఇది ఈ ఉదయం వాయుగుండంగా తుఫాన్ బలహీనపడనుంది. కొన్ని గంటల్లో వాయువ్య దిశగా పయనించి.. ఏపీ తీరం సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం చేరుకునే అవకాశం ఉంది. అసాని తుఫాన్ ప్రభావంతో నేడు కోస్తాంధ్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 50-60 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.

తుఫాన్ కారణంగా కోస్తాంధ్ర తీర ప్రాంతాల్లో అధికారులు ప్రకటించిన రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. మచిలీపట్నం, కళింగపట్నం, నిజాంపట్నం, విశాఖ, కాకినాడ, భీమిలి, గంగవరం పోర్టులలో జారీచేసిన 7వ నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. తుఫాన్‌ ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులతో చెట్లు నేలకూలాయి. విద్యుత్‌ స్తంభాలు పడిపోవడంతో విద్యుత్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కోస్తాంధ్రకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసి.... కంట్రోల్‌ రూంలు ఏర్పాటు చేశారు. తుఫాన్‌ ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లో మెరైన్‌ పోలీసులు, జిల్లా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రధాన బీచ్‌లలో ప్రవేశాలను నిలిపేశారు. నరసాపురంలో ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది రంగంలోకి దిగారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు.

తుఫాన్‌ ప్రభావంతో ఏలూరు జిల్లాలో తీరం అల్లకల్లోలంగా మారింది. పీఎం లంక, సీఎం లంక, కేపీపాలెం, పేరుపాలెం ప్రాంతాల్లో అలలు ఉధృతి పెరిగింది. మచిలీపట్నం మంగినపూడి సముద్రం అల్లకల్లోలంగా మారింది. సుమారు 20 మీటర్ల మేర సముద్రం ముందుకు రావడంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. గన్నవరం ఎయిర్‌ పోర్ట్‌లోనూ పలు విమాన సర్వీసులను రద్దు చేశారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగానూ భారీ వర్షాలు కురిశాయి. ఇప్పటికే రంగంలోకి దిగిన ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది... లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో భారీగావర్షాలు కురిశాయి. కోనసీమ జిల్లాలోని రాజోలు, సఖినేటి పల్లి, మలికిపురం, మామిడికుదురు మండలాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి.

Tags

Read MoreRead Less
Next Story