RAINS: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

RAINS: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
X
వాతావరణ శాఖ హెచ్చరిక... ఏపీలోనూ పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు

మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 22 నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావనంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. మరో ఆవర్తనం సైతం అండమాన్ సముద్ర ప్రాంతంలో సగటున సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

ఏపీలో వర్షాలు

ఉపరిత ద్రోణి ప్రభావం దక్షిణ కర్ణాటక, రాయలసీమ మీదుగా కోస్తాంధ్ర తీరం వరకు ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఏపీలో నేడు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉత్తర, కోస్తాంధ్రతో పాటు రాయలసీమలోనూ తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. వర్షాల కారణంగా అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎత్తు ప్రదేశాలకు వెళ్లాలని తెలిపింది. వర్షాలు పడే సమయంలో పిడుగులు పడే అవకాశం ఉందని, రైతులు, పశువుల కాపరులు చెట్ల కిందకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, నంద్యాల, అల్లూరి సీతారామరాజు, విశాఖ, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. అటు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్ని చోట్ల ఆదివారం తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

తెలంగాణలోనూ...

తెలంగాణలోనూ మరో 4 రోజులు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో అక్కడక్కడ వానలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

Tags

Next Story