అనంతపురం జిల్లా తాడిపత్రిలో వీడని హైటెన్షన్

అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఇంకా హైటెన్షన్ వీడలేదు. 144 సెక్షన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. అధికార, ప్రతిపక్ష నేతల ఇళ్లపై పోలీసుల నిఘా ఉంది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల దుర్వినియోగాన్ని నిరసిస్తూ.. నిన్న మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి చేపట్టిన దీక్ష విరమించారు. పోలీసుల ఆంక్షల నేపథ్యంలో ఉదయం నుంచి ఇంట్లోనే శాంతియుతంగా దీక్ష చేశారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి వెంటే ఉంటామని కార్యకర్తలు నినాదాలు చేశారు. అంతకముందు తహశీల్దార్ కార్యాలయం దగ్గర దీక్షకు దిగేందుకు బయలుదేరిన జేసీ సోదరులను పోలీసులు అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో ఇంట్లోనే శాంతియుతంగా జేసీ దివాకరరెడ్డి దీక్ష చేపట్టారు.
ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో తమపై పోలీసులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని టీడీపీ సీనియర్‌నేత జేసీ దివాకర్‌రెడ్డి మండిపడ్డారు. శాంతియుత నిరసన చేస్తున్న సమయంలో పోలీసులు అనుమతి లేకుండా గదిలోకి ఎలా వస్తారని ప్రశ్నించారు. పోలీసుల ప్రవర్తన పట్ల తీవ్రస్థాయిలో జేసీ దివాకర్‌రెడ్డి మండిపడ్డారు. పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా మారారని విమర్శించారు.
సంక్రాంతి తర్వాత గ్రామాల్లో పర్యటించి..అట్రాసిటీ కేసుల దుర్వినియోగంపై ప్రజల్లో చైతన్యం కలిగిస్తానని జేసీ ప్రభాకర్‌రెడ్డి వెల్లడించారు. జేసీ సోదరుల్ని పోలీసులు గృహ నిర్బంధం చేయడంతో.. వారి తరుపున దీక్ష చేయడానికి జేసీ ప్రభాకర్ రెడ్డి భార్య ఉమారెడ్డి.. ఎమ్మోర్వో ఆఫీసుకు చేరుకున్నారు. ఆమెను కూడా పోలీసులు అడ్డుకుని, వెనక్కి పంపించారు. పోలీసుల ఆంక్షలపై జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వం, పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
మరోవైపు తాడిపత్రికి బయటవాళ్లు రాకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. ఐడీ కార్డు ఉంటేనే అనుమతిస్తున్నారు. ఉద్రిక్త పరిస్థితిలు చోటుచేసుకోకుండా పోలీసులు మోహరించారు. ఎలాంటి సభలు, సమావేశాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. మరోపైపు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై కూడా పోలీసులు నిఘా పెట్టారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com