Dowleswaram : ధవళేశ్వరం వద్ద హైఅలర్ట్
ధవళేశ్వరం ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు పలు నీటి ప్రాజెక్ట్ వద్ద జలకళ సంతరించుకుంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లాలో వర్షప్రభావం అధికంగా కనిపించింది. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే గుర్తింపు పొందిన ధవళేశ్వరం ప్రాజెక్ట్ కు భారీగా వరద నీరు చేరింది. అంతేకాకుండా చుట్టూ ఉండే కొండ ప్రాంతాలలో కూడా వర్షాల జోరు ఉండగా, అక్కడి వరద నీరు కూడా ధవళేశ్వరంకి చేరింది.
దీనితో ధవళేశ్వరం వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 10.12 లక్షల క్యూసెక్కులకు చేరగా.. అధికారులు అప్రమత్తమయ్యారు. నిరంతరం ప్రాజెక్ట్ వద్దనే ఉంటూ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఏపీ విపత్తు సంస్థలోని స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు ధవళేశ్వరం ప్రాజెక్ట్ స్థితిని గమనిస్తూ అధికారులను అప్రమత్తం చేసినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాధ్ తెలిపారు. అలాగే సహాయక చర్యలకు సన్నద్దంగా ఉండేందుకు ఇప్పటికే 5 ఎన్డీఆర్ఎఫ్, 4 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి.
గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండేలా అధికారులు వారిని జాగ్రత పరిచారు. అత్యవసర సహాయక చర్యల కోసం స్టేట్ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ 1070, 112, 18004250101 నెంబర్లను సంప్రదించాలని డైరెక్టర్ రోణంకి కూర్మనాధ్ తెలిపారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com