బిగ్ బ్రేకింగ్.. ఏపీలో పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

ఏపీ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలింది.. పంచాయితీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ పై సింగిల్ జడ్జ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ధర్మాసనం కొట్టేసింది.. ఈ నెల 8న ఎస్ ఈసీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని ప్రభుత్వానికి సూచించింది. మంగళవారం ఎస్ఈసీ వినిపించిన వాధనలతో ధర్మాసనం ఏకీభవించింది. దీంతో ఎన్నికలకు అనుకున్న షెడ్యూల్ ప్రకారమే నిర్వహించాలని స్పష్టం చేసింది. ఎస్ఈసీతో ప్రభుత్వం సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లలని కూడా పేర్కొంది.
సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ SEC వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా మూడు రోజుల పాటు ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు.. ఇవాళ తీర్పు ఇస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజారోగ్యం, ఎన్నికలు రెండూ ముఖ్యమే అని స్పష్టం చేసింది. ఎన్నికల సంఘానికి ప్రభుత్వం సహకరించాల్సిందేనని వివరించింది. ఇరు వర్గాలు సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించింది. తాజా కోర్టు తీర్పుతో ఏపీలో ముందనుకున్న షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం నాలుగు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 23 నుంచి ఏపీలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది.
నాలుగు విడతలుగా జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి తొలి విడతకు జనవరి 23న నోటిఫికేషన్ వస్తుంది. రెండో విడతకు ఈనెల 27న, మూడో విడతకు జనవరి 31న, ఆఖరు విడతకు ఫిబ్రవరి4న నోటిఫికేషన్లు వెలువడతాయి. జనవరి 23న నోటిఫికేషన్ వచ్చిన తొలి దశకు ఫిబ్రవరి 5వ తేదీన పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి. రెండో విడత పోలింగ్ ఫిబ్రవరి 9న ఉంటుంది. 13వ తేదీ, 17వ తేదీల్లో మూడు, నాలుగో విడత పోలింగ్ ఉంటుంది. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరపొచ్చని హైకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో.. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌లకు, ఎన్నికల ఏర్పాట్లపై చర్చించేందుకు ఈసీ సిద్ధమవుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com