Chandrababu: చంద్రుడికి కోపం వచ్చింది
సీఎం చంద్రబాబుకు కోపం వచ్చింది. వరదలో బురద రాజకీయాలు చేస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుడమేరు, రాజధాని, వరద ప్రాంతాల సహాయ చర్యలపై వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టారు. వారు చిల్లర రాజకీయాలు మానుకోవాలంటూ ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన ‘ బుడమేరుకు పడిన గండ్లను గత వైసీపీ ప్రభుత్వం పూడ్చి ఉంటే విజయవాడలో ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు. అప్పుడు నిద్రపోయి, ఇప్పుడు లేచి వచ్చి రాళ్లు విసురుతున్నారు. ప్రజలు మీకు అధికారం ఇచ్చినప్పుడు ఏం చేశారు? గాడిదలు కాశారా? మేంవచ్చి కేవలం 80రోజులైంది. బుడమేరుకు ఎప్పుడో గండ్లు పడి ఉన్నా పట్టించుకోలేదు. అడ్డగోలుగా కట్టలను ఆక్రమించేశారు. ప్లాట్లు చేసి అమ్ముకొన్నారు. మేం పడుతున్న కష్టాన్ని ప్రజలంతా గుర్తిస్తున్నారు. అధికారంలో ఉండి తప్పులు చేసిన వారు మౌనంగా ఉంటే అదొక పద్ధతి. కానీ ఎదురుదాడికి దిగితే సహించబోం. అహంభావం ప్రదర్శిస్తే ఏం చేయాలో అది చేస్తాం. చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఈ రాక్షస మూక నానారకాల ప్రచారాలతో ప్రజలను ఆందోళనకు గురిచేయాలని చూస్తోంది. నా ఇల్లు కాపాడుకోవడానికి బుడమేరు గేట్లు ఎత్తానని మాట్లాడుతున్నారు. నా ఇల్లు ఎక్కడ ఉంది? బుడమేరు ఎక్కడ ఉంది? ఏమిటీ పైశాచిక ఆనందం? దీనిపై క్షమాపణ చెప్పేవరకూ వదిలిపెట్టను. ఇక్కడ ఏడు లక్షల మందికి మేం సేవలందిస్తున్నాం. అమరావతి ప్రాంతాన్ని శ్మశానం అంటూ శాపనార్థాలు పెట్టారు. ఆ శ్మశానంలోనే వీరినే పూడ్చాలి. సొంత పత్రికలో బుద్ధిలేని రాతలు రాస్తున్నారు. వైసీపీ నేతలకు విమర్శలు చేసేటప్పుడు ఇంగిత జ్ఞానం ఉండాలన్నారు.
రాత్రి, పగలు పని చేస్తున్నాం..
వరద బాధితులకు సాయం అందించడంలో అలసత్వం లేకుండా పని చేస్తున్నాం, రాత్రనక, పగలనక ప్రజలకు సేవలందిస్తున్నాం. 10లక్షల ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశాం. 5 లక్షల మంది భోజన ఏర్పాట్లు చేశాం. గర్భిణీలకు ప్రత్యేక వైద్యం అందించాలని ఆదేశించామన్నారు చంద్రబాబు. అధికారులను కూడా వరద సహాయక చర్యల్లో పని చేయిస్తున్నామని..అనేక మంది స్వచ్చందంగా వచ్చి బురద ప్రాంతాల్లో తిరుగుతున్నారని గుర్తు చేశారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేశాం.. మందులు సరఫరా చేస్తున్నాం..7 లక్షల మందికి సరఫరా చేసినప్పుడు చిన్న, చిన్న సమస్యలు వస్తాయని , వాటిని భూతద్దంలో చూపడం మానుకోవాలన్నారు. ఇలాంటి విపత్తును తన జీవితంలో ఎప్పుడు చూడలేదన్నారు. వరద ప్రాంతాల్లో బోట్లకు డబ్బులు వసూలు చేసినట్టు తేలితే కేసులు నమోదు చేయిస్తానని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com